ఒక్క గంటలో చంద్రబాబు సర్కారును కూలగొడతామంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రాలో అగ్ర పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారన్న జగన్.. టీడీపీ ఎమ్మెల్యేలే వైసీపీలోకి వచ్చేందుకు క్యూలు కడుతున్నారని మొన్న గవర్నర్ ను కలసి బయటికొచ్చి సమయంలో కామెంట్ చేశారు.
మా బలం 67 అన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు నాతో టచ్ లో ఉన్నారు. ఆ సంఖ్య 27కు చేరితే ఆ రోజు తప్పకుండా సర్కారును పడగొడతా.. నాకు ఆ బలం వచ్చిన గంటలోనే సర్కారును పడగొడతా.. అంటూ ఆ రోజు జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు దానికి ఖండన మండనలు ఇచ్చే పనిలో పడ్డారు.
చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కొందరు అంటే.. ఇవి రాజద్రోహం కిందకు వస్తాయని మరికొందరు టీడీపీ నేతలు మండిపడ్డారు. దమ్ముంటే జగన్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని మంత్రులు నారాయణ, పుల్లారావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు సవాల్ విసిరారు.
సభాపతిపై అవిశ్వాసం పెడతానన్న జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందిస్తూ.. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉండగా కూడా జగన్ ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పినా ఏం చేయలేకపోయారని విమర్శించారు. జగన్ కు దమ్ముంటే.. మీ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తాము గట్టిగా తలచుకుంటే వైసీపీని ఖాళీ చేయడం పెద్ద విషయం కాదని మంత్రులు ధీమాగా చెప్పారు.