మహేశ్ బాబాయికి జగన్ ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో..!

Chakravarthi Kalyan
సినిమా నటుల రాజకీయాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాల్లో పాత్రలను మార్చేసినంత సులభంగా వీరు పార్టీలు మార్చేయగలరు. మొన్నటికి మొన్న జయసుధ కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు జగన్ పార్టీలో ఓ సినీ ప్రముఖుడికి ప్రమోషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు, సిని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు జగన్ పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఆయన్ను జగన్ నియమించారు. నటుడు కృష్ణ ఫ్యామిలీ రాజకీయాల్లో ఎన్నో మలుపులు ఉన్నాయి. హీరో కృష్ణ మాంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ ను వ్యతిరేకించేవారు. ఆయన కాంగ్రెస్ లో చేరి టీడీపీపై పోటీ చేసి ఎంపీ కూడా అయ్యారు. 

ఆ తర్వాత కృష్ణ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. ఆయన భార్య విజయ నిర్మల కొంతకాలం టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం హీరో కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీగా ఉన్నారు. జయదేవ్ తల్లి గల్లా అరుణ..గత అసెంబ్లీ ఎన్నికల ముందే టీడీపీలోకి వచ్చారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. 

ఇక కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు విషయానికి వస్తే.. ఈయన కూడా అన్నతోపాటు మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి మారారు. ఇప్పుడు వైసీపీలో ఆదిశేషగిరిరావుకు ప్రాముఖ్యత ఉన్న పదవి దక్కడం ఆసక్తి కలిగిస్తోంది. కుటుంబంలో ఇంత మంది ఇన్ని జంపింగులు చేసినా హీరో మహేశ్ మాత్రం రాజకీయంగా ఇంతవరకూ ఎలా నిర్ణయమూ తీసుకోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: