నీయబ్బ.. జగన్ ఏం సాధించావురా.. జేసీ రంకెలు..

Chakravarthi Kalyan
ఏస్థాయికి వెళ్లినా మూలాలు మరవని నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. అచ్చమైన రాయలసీమ యాసలో.. ఒకింత నిర్లక్ష్యంగా.. ఒకింత హాస్యం కలగలుపుతూ మాట్లాడే జేసీ తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఏదో ఒక రకంగా మీడియాలో ఉంటూ తన పాపులారిటీ పెంచుకుంటుంటారు. సోమవారం కూడా అలాంటి ప్రయత్నమే చేసారు జేసీ దివాకర్ రెడ్డి. 

అసెంబ్లీ మీడియా పాయింట్లో సుదీర్ఘ సమయం మాట్లాడారు. అసెంబ్లీలో జగన్ వ్యవహారశైలిపై హాట్ హాట్ కామెంట్లు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ బాగానే మాట్లాడాడన్న టాక్ వచ్చింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్న విషయాన్ని బాగానే ఎస్టాబ్లిష్ చేశాడన్న కామెంట్లు వినిపించాయి. సీనియర్ నేత జేసీ మాత్రం జగన్ వైఖరిపై మండిపడ్డారు. 

అసెంబ్లీ జగన్ వ్యవహారం ఎలా ఉంది సార్ అని ఓ విలేకరి ప్రశ్నించడమే ఆలశ్యం.. జగన్ పై విమర్శలకు తగులుకున్నారు జేసీ.. ఏందిరా నీయబ్బజగన్.. ఏందిరా నువ్వు సాధించింది అంటూ అందుకున్నారు.. ఏం సాధించాడండీ.. మీరు చెప్పండి.. ఓ అంటూ ఓ రెండు ఫోటోలు పట్టుకుని పూనకం వచ్చినట్టు చేసినాడు తప్పతే ఏం సాధించాడు అంటూ జగన్ తీరుపై మండిపడ్డారు. 

ఒకసారి ఆ ఫోటోలు చూపితే ఫరవాలా.. కానీ ఊరికే అదే పనా.. అదేనా నువ్వు చేయాల్సింది.. అంటూ విమర్శలు గుప్పించారు. ఏదో ఒకసారి ఫలానా ఫోటోలో ఫలానా విధంగా సీఎం ఉండారు అని చెబితే సరిపోదా.. ఊరికే.. ఇక అదేపనా.. అని విమర్శించారు. జేసీ విమర్శల్లో కూడా కాస్త వాస్తవం లేకపోలేదు. కాల్ మనీ వ్యవహారం వచ్చినప్పుడల్లా జగన్ అదే పనిగా ఫోటోలు చూపించి విమర్శలు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: