గోదావరి : పవన్ ప్రకటన రివర్స్ కొడుతుందా ?

Vijaya



క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు,  అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కల్యాన్ వైఖరిపై కాపుసామాజికవర్గం మండుతున్నదట. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి పదవి అడిగే అర్హత తనకు లేదని ప్రకటించటమే. సీఎం పదవి అడిగేందుకు 2019 ఎన్నికల్లో 40 సీట్లు గెలవలేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడగనని పవన్ డైరెక్టుగా చెప్పేశారు. పార్టీ 40 సీట్లు గెలిచేంతవరకు తాను సీఎం పదవిని తీసుకోనని పవన్ చెప్పినట్లుగా అర్ధమవుతోంది.



ఇక్కడే కాపుసామాజికవర్గంలోని వివిధ వర్గాలు మండిపోతున్నాయి. సీఎం పదవిని అడగనంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కోసమని తాము చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవటానికి ఓట్లేయాలా అనే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. పవన్ సీఎం క్యాండిడేట్ కానపుడు టీడీపీకి ఎందుకు ఓట్లేయాలనే ప్రశ్న ఎదురవుతోంది. కాపులకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లిస్తుందో ఆ పార్టీకే వ్యక్తిగత హోదాలో కాపులు ఓట్లేస్తే సరిపోతుంది కదాని కాపు సామాజికవర్గంలోని కొన్ని గ్రూపుల్లో చర్చలు జరుగుతోంది.



దీనికి కొనసాగింపుగా మండపేట నియోజకవర్గంలోని మండపేట రూరల్ మండలం జనసేన పార్టీకి సుమారు 30 మంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసినవారంతా మండలంలో యాక్టివ్ గా పనిచేస్తున్న వాళ్ళే. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ సీఎం అభ్యర్ధి అవుతారు అన్న ఉద్దేశ్యంతోనే వీళ్ళంతా పార్టీకి పనిచేస్తున్నారు. ఇపుడు ఆ ముచ్చట సాధ్యంకాదని తేలిపోవటంతో జనసేన కోసం పనిచేయాల్సిన అవసరంలేదని ఏడిద పంచాయితి వార్డు సభ్యుడు, జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి అర్జున్ తో పాటు మరికొందరు రాజీనామాలు చేశారు.



కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందని ఆశించారు. అలా కానపుడు ఇక పార్టీలతో సంబంధంలేకుండా వివిధ పార్టీల తరపున పోటీచేయబోయే కాపులను గెలిపించుకునేందుకే కాపు సామాజికవర్గం పనిచేస్తే సరిపోతుందనే వాదన బలపడుతోంది. కాపుల ఓట్లు ఎవరికి వేయాలో నిర్దేశించే అధికారం జనసేనకు లేదని కాబట్టి పవన్ ఆశిస్తున్నట్లు కాపులంతా గుండుగుత్తగా టీడీపీకి ఓట్లేయాల్సిన అవసరం ఏమిటనే చర్చ కాపుల్లో పెరిగిపోతోంది. మొత్తానికి పవన్ చేసిన ప్రకటన రివర్సు కొట్టేట్లుగానే ఉంది చూస్తుంటే.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: