ఉత్తరాంధ్ర : జగన్ ప్లానింగును చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారా ?

Vijaya



రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రపై మూడుపార్టీలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ హోదాలో విశాఖపట్నంకి మారాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అయితే అది ఏమవుతుందో తెలీని నేపధ్యంలో సెప్టెంబర్లో తన క్యాంపాఫీసును వైజాగ్ కు మార్చేయబోతున్నారు. తాను విశాఖలో క్యాంపువేసి ఉత్తరాంధ్రను స్వీప్ చేసేయాలన్నది జగన్ ఆలోచన. ఇదేసమయంలో కోల్పోయిన పూర్వవైభవాన్ని ఎలాగైనా సాధించాలన్నది చంద్రబాబు ప్రయత్నాలు. అందుకనే అవకాశం దొరికినప్పుడల్లా వైజాగ్ వస్తున్నారు. ఇక పవన్ కూడా ఉత్తరాంధ్రపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.



చంద్రబాబు, పవన్ను ఉక్కిరిబిక్కిరిచేయటానికి జగన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అందుకనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలన్నింటినీ ఉత్తరాంధ్రలోనే చేస్తున్నారు. మార్చిలో రెండురోజుల పాటు అంతర్జాతీయపెట్టుబడుల సదస్సు నిర్వహించారు. విశాఖకు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి అనేకమంది ప్రపంచస్ధాయి పారిశ్రామికవేత్తలను రప్పించారు. చివరి వారంలో వైజాగ్ లోనే జీ20 సన్నాహక సదస్పు కూడా నిర్వహించారు.



ఇక ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట(భావనపాడు)పోర్టు పనులకు శ్రీకారంచుట్టారు. అలాగే వంశధార ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపనచేశారు. మే నెల మొదట్లోనే అంటే 3వ తేదీన విజయనగరం-వైజాగ్-శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉన్న  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేశారు. అలాగే అదానీ డేటా సెంటర్ కు భూమిపూజ చేశారు. జూన్ నెలలో శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం  నిర్మించిన 200 పడకల సూపర్ స్పాషాలిటి ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ ను ప్రారంభించబోతున్నారు.



అలాగే ఉత్థానం కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించబోతున్నారు. జూలైలో విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్ధాపన చేయబోతున్నారు. అలాగే విజయనగరంలో నిర్మాణం పూర్తికావచ్చిన మెడికల్ కాలేజీ భవనాలను తనిఖీ చేసే అవకాశముందంటున్నారు. ఆగస్టులో వైజాగ్-భోగాపురం మధ్యా ఆరు లైన్ల జాతీయ రహదారికి శంకుస్ధాపన జరగబోతోంది. సెప్టెంబర్లో ఎలాగూ జగనే వైజాగ్ వచ్చేస్తున్నారు. మొత్తానికి చాలా ప్లాన్డుగా జగన్ తన కార్యక్రమాలను డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ప్లానింగ్ కే చంద్రబాబు, పవన్ ఉక్కిరిబిక్కిరైపోతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: