హైదరాబాద్ : సునీత ఎంపీని వెంటాడుతోందా ?

Vijaya


తన తండ్రి మర్డర్ కేసులో హంతకులను ఎలాగైనా పట్టుకునేందుకు డాక్టర్ సునీత చూపిస్తున్న పట్టుదలను అభినందించాల్సిందే. ఇదే సమయంలో ఆమె చంద్రబాబునాయుడు చేతిలో పావుగా మారిపోయిందనే వైసీపీ నేతల ఆరోపణల గురించి కూడా ఆలోచించాల్సిందే. వైసీపీ నేతల ఆరోపణల గురించి ఎందుకు ఆలోచించాలంటే సునీత వైఖరిలో స్పష్టమైన తేడా కనబడుతోంది కాబట్టే. ఇప్పుడు విషయం ఏమిటంటే తన తండ్రి వివేకానందరెడ్డి మర్డర్ లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి పాత్రుందని సునీత బలంగా నమ్ముతున్నారు.



భాస్కర్ అరెస్టు అవ్వగా మిగిలింది అవినాష్ మాత్రమే. తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వెంటనే సునీత అభ్యంతరం చెబుతు ఇంప్లీడ్  పిటీషన్ వేశారు. అంటే కోర్టు ఒకవేళ ఎంపీకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని అనుకుంటే ముందు సునీత అభ్యంతరం వినాలి. ఎంపీ ముందస్తు బెయిల్ ను సునీత కచ్చితంగా తవ్యతిరేకిస్తారు.



ఇక్కడే సునీత వ్యవహారశైలిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదివరకు కూడా అవినాష్ ఒక పిటీషన్ వేయగానే సునీత ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. అంటే అవినాష్ పిటీషన్ వేయగానే సునీతకు వెంటనే సమాచారం చేరిపోతోంది. దాంతో అవినాష్ పిటీషన్ విచారణకు రాకుండానే సునీత ఇంప్లీడ్ పిటీషన్ వేసేస్తున్నారు. సునీతకు సమాచారం ఎవరిస్తున్నారు ? అన్న అవినాష్ ప్రశ్నకు సీబీఐ సమాధానం చెప్పటంలేదు. అలాగే హత్య జరిగిన తొలిరోజుల్లో హత్యతో జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ కు కానీ సంబంధమే లేదని సునీతే చెప్పారు.



ఆ వీడియోలన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. పైగా అప్పట్లో వైఎస్ కుటుంబం మీద చంద్రబాబు బురద చల్లేస్తున్నారని ఎదురుదాడి కూడా చేశారు. అలాంటిది తెరవెనుక ఏమైందో ఏమో హఠాత్తుగా ప్లేటు మార్చేశారు. ఇపుడు చంద్రబాబు అండ్ కో పేర్లు ఎక్కడా తేవటలేదు. ఎంతసేపు అవినాష్, భాస్కర్ రెడ్డి పేర్లనే చెబుతున్నారు. హత్యలో పాల్గొన్నట్లు అంగీకరించిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీత కోర్టును అడగటమే లేదు. హత్యతో సంబంధంలేదని మొత్తుకుంటున్న అవినాష్ ను వెంటాడుతున్న సునీత, జరిగిన హత్యలో తాను కూడా పాల్గొన్నట్లు అంగీకరించిన దస్తగిరిని మాత్రం పట్టించుకోకపోవటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: