అమరావతి : డిమాండు ఇంతలా పెరిగిపోతోందా ?

Vijaya



బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోతున్నట్లుంది. జనసేనలో చేరబోతున్నట్లు కొందరు, లేదు లేదు టీడీపీలోనే చేరుతారంటు మరికొందరు నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో అధిష్టానం ఆదేశిస్తే వైసీపీలో చేరేట్లుగా కన్నాతో చర్చిస్తానని అధికారపార్టీ నేతొకరు ప్రకటించారు. అయితే ఇవేవీ కాదు కన్నా చేరేది మాత్రం పలానా పార్టీలోనే అనే చర్చకూడా అంతర్లీనంగా వినబడుతోంది.



బీజేపీలో ఉన్నపుడే రాజీనామా తర్వాత కన్నా చేరబోయేది జనసేనలోనే అనే చర్చ అందరికీ తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల ఇపుడు జనసేనలో చేరుతారనే చర్చ పెద్దగా జరగటంలేదు. ఇదేసమయంలో కన్నా టీడీపీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే కన్నాను తమ పార్టీలో చేరేట్లుగా మాట్లాడుతానని వైసీపీ ఎంఎల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రకటించారు.



డొక్కా ప్రకటన నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే వైసీపీలో చేరేట్లయితే కన్నా 2019 ఎన్నికలకు ముందే చేరుండేవారు. అలాంటిది ఇపుడు చేరే అవకాశాలున్నట్లు పెద్దగా అనిపించటంలేదు. అయితే ఇదేసమయంలో కన్నా బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే తమపార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరితే బీజేపీ ఊరికే వదిలిపెట్టదు.  బీజేపీ నేతలను చేర్చుకున్న వేరే పార్టీలను ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎంత ఇబ్బంది పెడుతోందో అందరు చూస్తున్నదే.



ఈ కారణంగానే కన్నాను చేర్చుకునే విషయంలో టీడీపీ వెనకాడుతున్నట్లు టాక్ . అందుకనే బీఆర్ఎస్ లో చేరితో కన్నా బీజేపీ గురించి భయపడాల్సిన అవసరంలేదంటున్నారు. ఎలాగూ నరేంద్రమోడీపై కేసీయార్ పెద్ద యుద్ధమే చేస్తున్న కారణంగా కన్నా లాంటివాళ్ళు బీఆర్ఎస్ లో చేరితే  పార్టీకి కూడా ఉపయోగంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఫోన్లో కన్నాతో మాట్లాడినట్లు సమాచారం. మొత్తానికి బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కన్నాకు బాగా డిమాండ్ పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. మరి కన్నా ఆలోచనలు ఎలాగున్నాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: