హైదరాబాద్ : ఎంపీ అసలు వ్యూహమిదేనా ?

Vijaya



కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నేతలు శతృవులనే నానుడి ఎప్పటినుండో ఉన్నదే. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే బయటపార్టీల వల్ల కాదని అది కాంగ్రెస్ నేతల వల్లే సాధ్యమవుతుందని సీనియర్ నేతలు చెబుతునే ఉంటారు. వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇప్పుడిదంతా ఎందుకంటే పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నెత్తిన పెద్ద బండవేశారు. 




కాంగ్రెస్ పార్టీలో నుండి బయట వెళ్ళి దెబ్బకొట్టడం కన్నా పార్టీలోనే ఉంటు పేనుకొరికినట్లు కొరికేసి దెబ్బకొట్టడం తేలికని ఎంపీ అనుకుంటున్నట్లున్నారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతు రాబోయే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవక తప్పదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ సెక్యులర్ పార్టీలే కాబట్టి కేసీయార్ కాంగ్రెస్ తో కలవక తప్పదన చేసిన కామెంటు ఇపుడు సంచలనంగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీయార్ కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కూడా ఎంపీ చెప్పారు.



వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎంపీ ప్రకటించారు. దీనిపై ఇతర సీనియర్ నేతలంతా మండిపోతున్నారు. ఒకవైపు నేతలంతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెబుతుంటే ఎంపీ మాత్రం ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పటం ఏమిటంటు నిలదీస్తున్నారు. పైగా వచ్చేఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీ తప్పదని జోస్యం చెప్పారు. తామంతా ఏకతాటిపైకి వచ్చి కష్టపడితే కాంగ్రెస్ కు 40 సీట్లు రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.



వెంకటరెడ్డి తాజా కామెంట్లపై అధిష్టానం వెంటనే స్పందించాలని, యాక్షన్ తీసుకోవాలని సీనియర్లలో కొందరు డిమాండ్లు మొదలుపెట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే ఏమాత్రం పడని వెంకటరెడ్డి రెగ్యులర్ గా కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మునుగోడు బైపోల్ సమయంలో కూడా ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి ఫ్యామిలితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారు. ఎంపీ వ్యవహారం చూస్తుంటే పార్టీలోనే ఉంటూ వీలైనంతగా బీజేపీకి అనుకూలంగా దెబ్బకొట్టాలనే వ్యూహంతో ఉన్నట్లు అనుమానంగా ఉంది. మరి అధిష్టానం ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: