ఢిల్లీ : మాగుంటకు షాక్ తగిలిందా ?

Vijaya




ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద షాకిచ్చింది. ఎంపీ కొడుకు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్టుచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపాత్రుదారులందరినీ ఈడీ, సీబీఐ ఒక్కొక్కళ్ళని అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో కొందరు డైరెక్టుగా లిక్కర్ స్కామ్ లో పాత్రదారులుగాను మరికొందరిని మనీల్యాండరింగ్ ఆరోపణలపైన అరెస్టులు చేసింది. ఈ స్కామ్ ను ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.



స్కామ్ బయటపడినప్పటినుండి మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ పేర్లు వినబడుతునే ఉన్నాయి. స్కామ్ తో తమకెలాంటి సంబంధంలేదని ఎంపీ గతంలోనే చెప్పారు.  తమింటి పేరున్న వాళ్ళు ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేస్తున్నారని దర్యాప్తు సంస్ధలు పొరబాటు పడుంటాయని అప్పట్లో చెప్పారు. అయితే రాఘవను ఈడీ రెండుసార్లు విచారించాయి. దాంతో రాఘవ అరెస్టు ఖాయమని ప్రచారం మొదలైపోయింది.



అయితే విచిత్రంగా ఈమధ్యనే ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత పేర్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. చార్జిషీటు దాఖలు చేసిన కొద్దిరోజుల తర్వాత ఎంపీని కాకుండా శనివారం ఈడీ అధికారులు కొడుకు రాఘవరెడ్డిని అరెస్టుచేయటం గమనార్హం. కోర్టులో ప్రవేశపెట్టినపుడు రాఘవను 10 రోజుల కస్టడీకి అనుమతించింది. మొత్తానికి చాలాకాలంగా తిరుగుతున్న ఊహాగానాలు ఈరోజుకు నిజమయ్యాయి.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో శ్రీనివాసులరెడ్డి స్ధానంలో కొడుకు రాఘవ ఎంపీగా పోటీచేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఎంపీ కొడుకును నియోజకవర్గంలో బాగా ఎండార్స్ చేస్తున్నారు. వివిధ కారణాలతో ఎంపీ కొంతకాలంగా సైలెంటుగా ఉంటున్నారు. బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తామిద్దరిలో ఎవరో ఒక్కళ్ళపై యాక్షన్ ఉంటుందని అనుమానం వచ్చిందేమో. అందుకనే ఇద్దరు సైలెంటుగా ఉంటున్నారు. మొత్తానికి అధికారపార్టీ నేతలు అనుమానిస్తున్నట్లుగానే శనివారం రాఘవ అరెస్టవ్వటం పార్టీలో సంచలనంగా మారింది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: