హైదరాబాద్ : పూజలేనా..పర్యటనలు కూడా ఉంటాయా ?

Vijaya


ముచ్చటపడి తయారుచేయించుకున్న వారాహి వెహికల్ కు పూజలు చేయించటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంతకాలానికి తీరిక దొరికింది. ఈనెల 24వ తేదీన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ఉదయం, తర్వాత ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోను వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించబోతున్నారు. రెండుచోట్లా పూజలు జరిగిన తర్వాత తెలంగాణాలోని నేతలతో పవన్ భేటీ అవుతారు. ఇంతవరకు ఓకేనే కానీ అసలైన యాత్రలు ఎప్పటినుండి మొదలుపెట్టబోతున్నారు ? ఈ విషయమే తెలీక జనసేన నేతలు, కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో యాత్రలు చేయటానికి వీలుగా ప్రత్యేకంగా పవన్ వారాహిని తయారుచేయించుకుని చాలా రోజులైంది. దీని పరిచయ కార్యక్రమాన్ని కూడా సినిమా టీజర్ లెవల్లో చేశారు. ఇది జరిగి కూడా చాలా రోజులైంది. వారాహి యాత్ర ఉంటుంది ఉంటుందని పవన్, నేతలు చెబుతున్నారే కానీ ఎప్పటినుండి మొదలవుతుందో చెప్పటంలేదు.ఇంతకాలానికి వాహనానికి పూజలు చేయించేందుకు పవన్ కు తీరిక దొరికినట్లుంది. తయారైన వాహనానికి పూజలు చేయించటానికే ఇన్నిరోజులు పడితే ఇక యాత్రలు మొదలుపెట్టడానికి ఇంకెంతకాలం పడుతుంది ? ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉందని అనుకున్నా తెలంగాణాలో ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. షెడ్యూల్ ఎన్నికలు డిసెంబర్లో జరగాలి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి.ఇలాంటి స్ధితిలో అసలు పార్టీ నిర్మాణమే లేని జనసేన ఇంకెంత స్పీడుగా ఉండాలి ? పార్టీ మొత్తానికి పవన్ కల్యాణ్ తప్ప మరో దిక్కేలేదు. అలాంటి పవన్ కూడా పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. తెలంగాణాలో జనసేన పోటీచేస్తుందని ప్రకటించిన పవన్ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో మాత్రం ఫెయిలయ్యారు. ఇంతోటిదానికి మళ్ళీ వారాహి అని  యాత్రలని హడావుడెందుకు ? అయినా ఏపీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఖాయం. మరి తెలంగాణాలో ఏమి మాట్లాడతారబ్బా ?
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: