గోదావరి : తమ్ముడి తిరుగుబాటు.. యనమలకు షాక్ ?

Vijaya




తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ముసలం మొదలైనట్లే ఉంది. అదికూడా దశాబ్దాలుగా నియోజకవర్గంతో పాటు  జిల్లాను ఏలుతున్న యనమల కుటుంబంలోనే విభేదాలు రోడ్డునపడటం సంచలనంగా మారింది. గడచిన మూడు ఎన్నికల్లో తునిలో యనమల సోదరులు ఓడిపోయారు. 2009లో యనమల రామకృష్టుడు ఓడిపోతే తర్వాత 2014, 19 ఎన్నికల్లో ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు ఓడిపోయారు.



సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావి రామకృష్ణుడుకి చంద్రబాబునాయుడు దగ్గర బాగా పట్టుంది. దానికారణంగా జిల్లాలో చక్రంతిప్పారు. ఇదే సమయంలో తునిలో తనకు ఎదురులేకుండా చూసుకున్నారు. అయితే పరిస్ధితులు మారిపోయి గాలి ఎదురుతిరిగటంతో సోదరులిద్దరు వరుసగా ఓడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రామకృష్ణుడు తన కూతురు దివ్యకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం తన మద్దతుదారుల దగ్గర చెప్పారట.



ఇదే విషయం తమ్ముడి చెవినపడటంతో అన్నపైన మండిపోతున్నారు. పార్టీకోసం ఇంతకష్టపడుతున్న తనను కాదని దివ్యకు టికెట్ ఇప్పించుకుంటున్న అన్న రామకృష్ణుడిపై మండిపోతున్నారు. తనను కాదని టికెట్ ఇంకెవరికైనా ఇస్తే పార్టీ ఓడిపోవటం ఖాయమని రెచ్చిపోతున్నారు. ఇక్కడ కృష్ణుడు మరచిపోయిందేమంటే వరుసగా రెండు ఎన్నికల్లో తానే ఓడిపోయానని. ఇప్పటికే యనమల సోదరులపై జిల్లాలోని తమ్ముళ్ళల్లో బాగా మండిపోతోంది. జిల్లాలో మరో నేతను ఎదగకుండా తొక్కిపెట్టారంటు అంతర్గతంగా గోల జరుగుతోంది. మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న యనమల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని పార్టీలోని యువనేతలు డిమాండ్లు మొదలుపెట్టారు.



పార్టీకి కష్టపడి పనిచేస్తున్న యువనేతలకే టికెట్ ఇవ్వాలంటు ఈమధ్యనే బహిరంగంగానే డిమాండ్లు వినిపించారు. ఇలాంటి సమయంలోనే అన్నపై స్వయంగా తమ్ముడే తిరుగుబాటు చేయటం ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి రామకృష్ణుడు లేకపోతే తమ్ముడు కృష్ణుడు లేనేలేడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో రామకృష్ణుడి గెలుపుకు తమ్ముడు కూడా బాగా కష్టపడేవాడు. సరే ఇదంతా చరిత్రలో కలిసిపోయి ఇఫుడు అన్నపై తమ్ముడు తిరుగుబాటు లేవదీయటం ద్వారా పెద్ద షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి. లేకపోతే టికెట్ బయట వాళ్ళకు వెళ్ళకుండా సోదరులిద్దరు కలిసి డ్రామాలాడుతున్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: