బలపడిన అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..

Satvika
గత కొన్ని రోజులుగా ఏపీపై వరుణుడు ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. భారీ వరదలు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్క్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా వర్షాలు తగ్గలేదు వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.. అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. దీంతో మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది..



ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారి నైరుతికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ప్రవేశించనున్నది. తరువాత రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా లో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 21న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, 22 న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.



ఆదివారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. చేపల వేటలో వున్న మత్స్యకారులు ఆదివారంలోగా తీరానికి రావాలని సూచించింది. కాగా శనివారం రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరం లో 15 డిగ్రీలు నమోదైంది.. ఇలా వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో జనాలు భయంతో వణికిపోతున్నారు.. అధికారులు అలెర్ట్ అయ్యారు.. ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: