పార్లమెంట్ పై తప్పుడు ప్రచారం చేయొద్దు..

Deekshitha Reddy
పార్లమెంట్ లో కొన్ని పదాలు నిషేధించారని, అలా చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనంటూ అలజడి చెలరేగింది. దీంతో అన్ పార్లమెంటరీ పదాల జాబితాపై చెలరేగిన రాజకీయ దుమారంపై లోక్ సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్‌ లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధించ లేదని ఆయన చెప్పారు. పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ఉభయ సభల్లో వెల్లడించవచ్చని స్పష్టం చేశారు. బుక్ లెట్ ప్రచురించిన మాట వాస్తవమే అని, అయితే ప్రతి ఏడాది ఇది జరుగుతుందని, అన్ పార్లమెంటరీ పదాల జాబితా ఉంటుందని ఈసారి పుస్తక రూపంలో తీసుకు రాకుండా ఆన్ లైన్ లో పెట్టామని చెప్పారు.
సిగ్గు, జుమ్లా జీవి, తానాషా, ద్రోహం, అవినీతి, నాటకం.. వంటి పదాల జాబితాతో కూడిన ఓ బుక్ లెట్ ను ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసింది. ఆయా పదాలను అన్ పార్లమెంటరీ పదాల జాబితాలో చేర్చారని ప్రకటించింది. దీంతో వివాదం మొదలైంది. ఆయా పదాలను ఎక్కువగా ప్రతిపక్షాలు వాడుతుంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే సమయంలో ఉపయోగిస్తుంటాయి. అందులోనూ ఇటీవల జుమ్లా అనే పదం బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో కావాలనే బీజేపీకి ఫేవర్ చేయడం కోసమే ఇలాంటి పదాలు నిషేధించారంటూ ప్రచారం జరిగింది. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టత ఇచ్చారు.
పార్లమెంట్ లో ఏ పదాన్ని నిషేధించలేదన్నారు ఓం బిర్లా. సభ్యులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని, ఆ హక్కుని వేరెవరూ వచ్చి లాక్కోలేరని చెప్పారు. అది పార్లమెంటు పద్ధతి కూడా కాదన్నారు ఓం బిర్లా. అయితే సభ్యులు మాట్లాడే మాటలు పార్లమెంట్ పద్ధతి ప్రకారం ఉండాలని మాత్రమే ఆయన ఆకాంక్షించారు. అన్ పార్లమెంటరీ లిస్ట్ లో ఉన్న పదాలను కేవలం ప్రతిపక్ష సభ్యులే కాదు, అధికా పార్టీ వారు కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రమే ఉపయోగించే పదాలను కావాలనే తొలగించారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. పార్లమెంట్ లో నిషేధిత పదాలంటూ ప్రజలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు ఓం బిర్లా. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలియని వారు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారాయన. చట్టసభలు ఎప్పుడూ ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఉంటాయని చెప్పారు. 1959 నుంచి అన్ పార్లమెంటరీ పదాల విషయంలో ఒక కసరత్తు జరుగుతోందని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: