కంకిపాడు క్యాసినో.. ఏది నిజం..? ఎంత నిజం..?

Deekshitha Reddy
ఇటీవల గుడివాడ క్యాసినో వ్యవహారం ఎంత రచ్చ లేపిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా అక్కడ క్యాసినో జరిగిందని, అధికార పార్టీ అండతోనే అవన్నీ జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే సమయంలో అదంతా ప్రతిపక్షాల ఊహేనని, అలాంటివేవీ జరగలేదని, జరిగినా అందులో తమ ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో తరహా ఈవెంటే నిర్వహిస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రాలు కూడా బయటకు వచ్చాయి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు రాత్రి కంకిపాడులో క్యాసినో జరిగే అవకాశముంది. రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంట్రీ ఫీజు 20వేలుగా నిర్ధారించారట. మందు, విందు, చిందు... అన్నీ అక్కడేనని ప్రచారం జరిగింది. క్యాసినో తరహాలో జూదం ఏర్పాటుకి కూడా రంగం సిద్ధమైందని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ ఓ చిన్న గెట్ టు గెదర్ కి మాత్రమే అనుమతి అడిగారని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ బయటకు వెళ్లడంతో ఈ విషయంలో కలకలం రేగింది. కంకిపాడు టౌన్ లోని ఓ హోటల్, కన్వెన్షన్ సెంటర్లో ఈ క్యాసినో జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గెట్ టు గెదర్ అనే పేరుతో దీన్ని నిర్వహించాలనుకుంటున్నారట. ఈ మేరకు పోలీసులకు కూడా ఇలాగే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు కూడా అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఇక్కడ అనుమతి లేకుండానే డీజే, డ్యాన్స్ లు ఏర్పాటు చేస్తారనే అనుమానాలున్నాయి. అయితే ఇప్పుడీవిషయం బయటకు పొక్కడంతో ఏం జరుగుతుందోనని అనుమానాలున్నాయి. క్యాసినోని నిర్వహిస్తారా, లేక సైలెంట్ గా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. మరి ఇచ్చిన అడ్వాన్స్ లు మిగతావారు తిరిగిస్తారా..? అమ్ముడుపోయిన టికెట్ల సంగతేంటి అనేది తేలాల్సి ఉంది. నిర్వాహకులు ధైర్యం చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: