షాకింగ్.. అల్లర్లలో పాల్గొన్నవారికి యావజ్జీవ శిక్ష వేస్తారా..?

Deekshitha Reddy
అగ్నిపథ్‌ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతో చాలామంది అభ్యర్థులు, ఉద్యోగార్థులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దుర్ఘటనకు సంబంధించి మొత్తం 46 మందిని అరెస్ట్‌ చేశామని ఆమె చెప్పారు. ఈ ఘటనలో అరెస్ట్ అయినవారంతా తెలంగాణకు చెందినవారేనని చెప్పారామె. నిందితులకు యావజ్జీవ శిక్షలు పడే అవకాశాలున్నాయని రైల్వే ఎస్పీ అనురాధ చెప్పారు. యావజ్జీవ శిక్ష అంటే.. కచ్చితంగా అది వారికి అశనిపాతమే అవుతుంది. వారి కలలన్నీ కల్లలు అవుతాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉండదు.
మరోవైపు ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్‌ సెంటర్లను కూడా అధికారులు గుర్తించారు. ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు. రైల్వే స్టేషన్‌ లోకి చొరబడటం నేరమని, అలాంటివారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్లో చొరబడిన నేరం నిరూపితం అయితే, భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో ఆర్పీఎఎఫ్ కాల్పులు జరిపిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
నష్టం ఎంతంటే..?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మొత్తంగా 58 రైల్వే కోచ్‌ లు దెబ్బతిన్నాయని, దీనివల్ల రైల్వేకు రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని సికింద్రాబాద్ డివిజన్‌ సీనియర్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సుధాకర్‌ మీడియాకు తెలిపారు.
కేంద్రం ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన బాహ్య ప్రపంచానికి తెలుస్తుందని, తద్వారా ఈ విషయంపై చర్చ నడుస్తుందని వారంతా భావించినట్టు తెలిపారు రైల్వే ఎస్పీ. వాట్సప్ లో వారు పెట్టుకున్న గ్రూప్ ల వివరాలు కూడా సేకరించారు. రైల్వే స్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ, హకీంపేట్‌ ఆర్మీ స్టేషన్‌, చలో సికింద్రాబాద్‌.. ఇలా రకరకాల పేర్లతో గ్రూప్ లు క్రియేట్ చేశారు. అందులో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టారు. అప్పటికే బీహార్‌ లో ఆందోళనలు జరుగుతున్నాయని, ఇక్కడ కూడా ఇదే పంథాను అనుసరించాలని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు అభ్యర్థులను, తమ విద్యార్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు రెచ్చగొట్టడం వల్లే అభ్యర్థులు దాడులకు పాల్పడ్డారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: