హైదరాబాద్ : మనింటికి మనం నిప్పుపెట్టుకుంటామా ?

Vijaya



సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయటం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కేంద్రప్రభుత్వం ఆర్మీలో నియామకాలకు సంబంధించి తాజాగా ప్రకటించిన షార్ట్ సర్వీసును దేశవ్యాప్తంగా యువత వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా బీహార్లో గురువారం మొదలైన నిరసనలు చాలా స్పీడుగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు పాకింది. బీహార్, ఉత్తరప్రదేశ్, హరియానా, ఢిల్లీలో గురువారం ఆందోళనలు జరిగాయి.




అయితే ఎవరూ ఊహించినవిదంగా శుక్రవారం ఉదయం ఆందోళనకారులు హఠాత్తుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీద దాడులు జరిపారు. అందిన ఆస్తినంతా ధ్వంసంచేశారు. స్టేషన్లో ఆగున్న చాలా రైళ్ళకు నిప్పుపెట్టేశారు. ఫర్నీచర్, కార్గో సరుకు మొత్తాన్ని ధ్వంసం చేసేశారు. విధ్వంసాన్ని, ఆందోళనకారులను కంట్రోల్ చేయటానికి పోలీసులు కాల్పులు జరపాల్సొచ్చింది. ఈ కాల్పుల్లో ఒకయువకుడు చనిపోగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.




అంతా బాగానే ఉందికానీ కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకించే హక్కు యువతకుందనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో ప్రజల ఆస్తులను ధ్వంసంచేయటం, రైళ్ళకు నిప్పుపెట్టే హక్కులేదు. ఎవరిమీదైనా కోపమొస్తే మనింటికి మనం నిప్పుపెట్టుకుంటామా ? అని ఆందోళనకారులు ఆలోచించాలి. ఎవరికి ఎవరిమీద కోపమొచ్చినా ధ్వసమయ్యేది ప్రభుత్వ ఆస్తేనా ? ప్రభుత్వ ఆస్తంటే అది ప్రజల ఆస్తే అని మన ఆస్తే అని ఆందోళనకారులు మరచిపోతున్నారు.




జనాలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు సౌకర్యాలు సమకూరుస్తోంది. సౌకర్యాలను కూడా మళ్ళీ ప్రజలకోసమే ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందన్న విషయాన్ని అందరు మరచిపోతున్నారు. ఈరోజు ఆందోళనను, విధ్వంసాన్ని ఆందోళనకారులు నాలుగురోజులు పోతే మరచిపోతారు. కానీ చనిపోయిన యువకుడి ప్రాణాలను వెనక్కు తీసుకురాగలరా ? ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు నచ్చకపోతే నిరసన తెలిపే విధానం మాత్రం ఇదికాదు. అగ్నిపథ్ పథకం నచ్చకపోతే కేంద్రంతో  చర్చలు జరపాలి, వినకపోతే కోర్టుకెళ్ళాలి. అప్పటికీ సాద్యంకాకపోతే ఒక్కరు కూడా దరఖాస్తు కూడా చేయకూడదు. అప్పుడు ప్రభుత్వమే దిగొస్తుంది.





ఇదే సమయంలో కేంద్రం కూడా కాస్త ఆలోచించాలి. రెండేళ్ళక్రితమే ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి పాసై ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు జరిపి అగ్నిపథ్ వచ్చే ఏడాది నుండి మొదలుపెట్టుంటే బాగుండేది. అలాకాదని మూర్ఖంగా ప్రకటన చేయటంతోనే ఇపుడీ విధ్వంసాలు మొదలయ్యాయి. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటమంటే మనింటికి మనమే నిప్పుపెట్టుకోవటంలాంటిదిని ఆందోళనకారులు మరచిపోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: