రాహుల్ మాటలు తూటాల్లా పేలాయ్.. అసలేమన్నారంటే..!

NAGARJUNA NAKKA
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ముగిసింది. ఆయన శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ రోజు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ మాట్లాడారు. తర్వాత గాంధీ భవన్ లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర నిర్మాణ పనులను పరిశీలించారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పోరాటమే చేస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెనుక ధనం, పోలీసులు ఉన్నారు గానీ.. ప్రజలే లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మెరిట్ ఆధారంగా టికెట్లు ఇస్తామని చెప్పారు. సీనియర్లయినా.. పార్టీ కోసం పనిచేయకుంటే టికెట్ రాదన్నారు. వ్యక్తిగతంగా సర్వే చేసి టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ దక్కాలంటే హైదరాబాద్ ను వదిలి గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్లాలి అని తెలిపారు.
తెలంగాణలో 8ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన  బాధ్యత అందరిపై ఉందన్న రాహుల్.. నిరంకుశ కేసీఆర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అటు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలోకదలిరావాలన్నారు.
వరంగల్ డిక్లరేషన్ రైతులు, కాంగ్రెస్ కు మధ్య నమ్మకం కలిగించిందని రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ భవన్ లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. డిక్లరేషన్ అందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నారు. చిన్నపిల్లలకు కూడా వరంగల్ డిక్లరేషన్ గురించి తెలియాలన్నారు. నేతల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను నేరుగా తనకే చెప్పాలన్నారు. మీడియా ముందు చెప్పొద్దన్నారు.
అంతకుముందు చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ములాఖత్ కు పర్మీషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీతో సహా ఇద్దరు నేతలు చంచల్ గూడా జైలుకు వెళ్లి ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు దగ్గర భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: