హైదరాబాద్ : నోరెత్తటానికి నేతలు భయపడుతున్నారా ?

Vijaya



రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించి మాట్లాడటానికే భయపడిపోతున్నారు. గడచిన వారంరోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో పీకే ఢిల్లీలో నాలుగుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరటం కేవలం లాంఛనమే అని పార్టీ నేతలే చెప్పారు. తొందరలోనే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ మీడియా ముందే ప్రకటించారు.



సీన్ కట్ చేస్తే ఇదే పీకే హైదరాబాద్ కు వచ్చి కేసీయార్ తో భేటీ అయ్యారు. శని, ఆదివారాల్లో ప్రగతిభవన్లోనే మకాంవేసి కేసీయార్ తో చర్చల్లో ముణగితేలుతున్నారు. అంటే ఢిల్లీలో సోనియాతో హైదరాబాద్ లో కేసీయార్ తో పీకే భేటీ అవ్వటమే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కేసీయార్ ను గద్దెదింపు తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో చాలామంది సీనియర్లు కేసీయార్ పై పెద్ద పోరాటమే చేస్తున్నారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ తో ఇన్ని రోజులుగా పీకే భేటీ అవటాన్ని కాంగ్రెస్ సీనియర్లు చాలామంది అవహేళనగా మాట్లాడారు. పీకే వ్యూహాలు ఎందుకూ పనికిరావన్నట్లు మాట్లాడారు. ఎంతమంది పీకేలు కేసీయార్ తో ఉన్నా టీఆర్ఎస్ ఓటమిఖాయమంటు రెచ్చిపోయారు. అలాంటిది ఇపుడు ఇదే పీకే కాంగ్రెస్ కు వ్యూహకర్తగానే కాకుండా పార్టీలో కూడా చేరబోతున్నట్లు సంకేతాలు వచ్చేయటంతో ఏమి మాట్లాడాలో తెలంగాణా కాంగ్రెస్ నేతలకు అర్ధం కావటంలేదు.



ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీడియా అడిగినపుడు పీకే గురించి ఏమీ అడగద్దన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే పీకే వ్యవహారం సోనియా, రాహుల్ స్ధాయిలోని విషయం కాబట్టి తామేమీ మాట్లాడేందుకు లేదన్నారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క మాట్లాడుతు పార్టీలో పీకే చేరిక తమ పరిధిలోనిది కాదన్నారు. ఊహాజనిత విషయాలపై తాము ఏమీ మాట్లాడమన్నారు. అధిష్టానం ఏమి ఆదేశిస్తే తాము పాటిస్తామన్నారు. మొత్తానికి పీకే గురించి మాట్లాడటమంటేనే కాంగ్రెస్ నేతలు ఎంత భయపడిపోతున్నారో అర్ధమైపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: