అమరావతి : జగన్ దగ్గర ఆటలు సాగవని అర్ధమైపోయిందా ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరికైనా ట్రీట్మెంట్ ఒకటిగానే ఉంటుందని మరోసారి తేలిపోయింది.  హేతుబద్దత లేని డిమాండ్లు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని జగన్ అందరికీ ఒకేసారి సిగ్నల్ పంపించారు. డిమాండ్లలో హేతుబద్దత ఉంటే చేసింది ఎవరనే విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ డిమాండ్ల సాధనకు సానుకూలంగా స్పందిస్తానని కూడా జగన్ సిగ్నల్ పంపటం గమనార్హం.  జగన్లోని ఇన్ని రకాల వైరుధ్యాలకు జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ అంశమే వేదికయ్యింది.



విషయం ఏమిటంటే నగిరిని చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కలపాలన్న ఎంఎల్ఏ రోజా డిమాండ్ ను జగన్ పట్టించుకోలేదు. జగన్ కు రోజా ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయినా ఆమె డిమాండ్ లో హేతుబద్దత లేదన్న కారణంగా జగన్ నో చెప్పారు. రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్స్ స్ధానంలో రాజంపేటను చేర్చాలని చేసిన డిమాండ్లను కూడా జగన్ పట్టించుకోలేదు. ఇక్కడ కూడా జగన్ కు సన్నిహితులైన రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డి, కోడూరు ఎంఎల్ఏ కోరుముట్ల శ్రీనివాసులు ఎన్నిడిమాండ్లు చేసినా ఉపయోగం లేకపోయింది.



ఇదే సమయంలో నెల్లూరులోని వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి డిమాండును జగన్ సానుకూలంగా స్పందించారు. పార్టీలో ఆనంకు అసంతృప్తనేతగా ముద్రపడిన విషయం తెలిసిందే. ఏదోరోజు ఆనం పార్టీ వదిలేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాపూరు, కలువాయి, సైదాపేట మండలాలను నెల్లూరు జిల్లాలోన ఉంచాలని డిమాండ్ చేశారు. మొదటి డ్రాఫ్టులో పై మూడు మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. తన డిమాండుకు నీటి సమస్యల్లాంటి అనేక కారణాలను చూపించారు. జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత ఆనం డిమాండులో లాజిక్ ఉందని జగన్ కు అనిపించింది. దాంతో ఆనం డిమాండు నెరవేరింది.



అలాగే కుప్పంను రెవిన్యు డివిజన్ గా మార్చాలని చంద్రబాబునాయుడు లేఖ రాశారు. చంద్రబాబు లేవనెత్తిన అంశంపై సానుకూలంగా స్పందించిన జగన్ కుప్పంను రెవిన్యు డివిజన్ గా ప్రకటించారు. బావమరిది బాలకృష్ణ డిమాండు చేసినట్లు పుట్టపర్తి స్ధానంలో హిందుపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటే సాధ్యం కాదన్నారు. అంటే తాము జగన్ కు బాగా సన్నిహితులమని చెప్పుకున్నంత మాత్రాన తన దగ్గర ఆటలు సాగవని డైరెక్టుగానే జగన్ సిగ్నల్ పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: