ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి..

Deekshitha Reddy
పెట్రోల్ ధరలు ఆకాశానికంటడంతో.. చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ-స్కూటర్లు ఎంతవరకు సేఫ్. పెట్రోల్ ఖర్చు లేదు, కేవలం కరెంటు చార్జింగ్ పెడితే బండి నడుస్తుంది అనుకుంటున్నారా..? అయితే మీరు మరికొంత ఆలోచించాల్సిందే. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి మీకు తెలుసా..? వారం రోజుల క్రితం తమిళనాడులోని వెల్లూరులో ఎలక్ట్రిక్ స్కూటర్‌ కి చార్జింగ్‌ పెట్టి ఇంటిలో నిద్రపోతున్న తండ్రీకూతుళ్లు తెల్లారే సరికి శవాలుగా మారారు. స్కూటర్ లో ఉన్న బ్యాటరీ పేలి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. చెన్నైలో మూడు రోజుల క్రితం పార్కింగ్ చేసిన స్కూటర్ లో మంటలు వచ్చాయి. తిరుచ్చి, పుణెలో కూడా ఇలాగే స్కూటర్లో మంటలు చెలరేగాయి. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 6 ఘటనలు జరిగాయి. అన్నీ బ్యాటరీ వైఫల్యాలే. ఘోర ప్రమాదాలే. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణికులు ఉంటే మరింత దారుణాలు జరిగేవి.
ఎందుకీ వైఫల్యం..
ఎండాకాలంలో ఎక్కువగా కారుల్లో మంటలు వస్తున్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. కానీ ఈ వేసవి మొదలు కాగానే.. ఎలక్ట్రిక్ స్కూటర్లు మండిపోతున్నాయి. ఓవైపు పెట్రోల్ రేట్లు మండిపోతుండటంతో.. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మారుతున్నారు. వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో చాలావరకు వాహనాల్లో ఉంచిన లిథియం అయాన్ బ్యాటరీలే కారణం అని తేలుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో సంప్రదాయ లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలు వాడేవారు. ఆ తర్వాత లిథియం-అయాన్‌ బ్యాటరీలను వాడుతున్నారు. వీటి నాణ్యత, మన్నిక చాలా ఎక్కువ కావడంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఒక కిలో బరువుండే లిథియం-అయాన్‌ బ్యాటరీలో 150 వాట్‌-అవర్స్‌ స్టోరీ చేసుకోవచ్చు, దానితో బండి నడిపించొచ్చు. వీటి ఫుల్‌చార్జింగ్‌ కు కూడా ఎక్కువ సమయం పట్టదు. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.
అయితే ఈ బ్యాటరీల వల్ల కొంత నష్టాలు కూడా ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌, లో ఓల్టేజీ, హై ఓల్టేజీ వల్ల కూడా లిథియం-అయాన్‌ బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎర్త్‌ లేని ఇళ్లలో బ్యాటరీలను చార్జ్‌ చేస్తే.. వైరింగ్‌ లో లోపాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంది. షార్ట్‌ సర్క్యూట్‌ కి ఎక్కువగా అవకాశముంటుంది. ఆ సందర్భాల్లోనే బ్యాటరీల పేలుళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఓవర్‌ చార్జింగ్‌,  ఓల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని అంటున్నారు. మరి వీటిని నివారించడం ఎలా..?
ప్రస్తుతం వీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లను వాయిదా వేస్తున్న్టటు తెలుస్తోంది. అయితే ఈ-స్కూటర్లను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందని, కొంతమంది పాత కస్టమర్లు కూడా చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఈ-స్కూటర్లను వాడేవారు కూడా ఉన్నారు. వారంతా వీటివల్ల ప్రమాదం లేదంటున్నారు. మరి ఇటీవల జరిగిన ప్రమాదాల వల్ల మాత్రం వినియోగదారుల్లో కొంత గందరగోళం ఏర్పడినమాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: