ఆ విషయంలో చంద్రబాబుని వ్యతిరేకించిన టీడీపీ ఎమ్మెల్యేలు..

Deekshitha Reddy
చంద్రబాబు మాటంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వేద వాక్కు. ఆయనతో ఏ విషయంలోనూ విభేదించరు, వ్యతిరేకంగా ఉండరు. ఒకవేళ వ్యతిరేకించాలనుకుంటే పార్టీలో ఉండరు. కానీ పార్టీలో ఉంటూ చంద్రబాబు మాటల్ని వ్యతిరేకిస్తూ ఎవరూ లేరు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని ఏకంగా ఎమ్మెల్యేలే వ్యతిరేకించారట. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని చాలామంది ఒప్పుకోలేదట. తాను అసెంబ్లీకి రాకుండా.. మిగతా ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలనేది బాబు ఆలోచన. కానీ దానికి కొంతమంది ఒప్పుకోలేదని సమాచారం. చంద్రబాబుకి జరిగిన అవమానం, తమకు జరిగినట్టేనని, అందుకే సభను బాయ్ కాట్ చేద్దామన్నారట. కానీ చివరిగా చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలు సభకు వెళ్లేందుకు సీనియర్లు ఒప్పించారు.
ఈ నెల 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు కూడా. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే విషయంలో ఇటీవల వరకు టీడీపీ మల్లగుల్లాలు పడినమాట వాస్తవం. మొదట జరిగిన పోలిట్‌ బ్యూరో సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ టీడీఎల్పీ సమావేశంలో మాత్రం అసెంబ్లీకి వెళ్లేందుకు అందరూ అంగీకరించారు. చంద్రబాబు మాత్రం ఈ సమావేశాలకు హాజరు కారు. అధినేత మినహా.. మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... సభకు వెళ్లకూడదని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత దాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఓ దశలో చంద్రబాబే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లాలని సూచించారని, కానీ వారు అంగీకరించలేదని సమాచారం.
చివరకు సీనియర్లు పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు సూచనల మేరకు టీడీపీ బ్యాచ్ రంగంలోకి దిగుతోంది. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిపేందుకు టీడీపీ సభ్యులు సభకు హాజరవుతామంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చకోసం తమ డిమాండ్లను బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో ప్రస్తావించబోతున్నారు. బీఏసీ మీటింగ్ లో అధికార పక్షం స్పందించే తీరుని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అంశం, పోలవరం ప్రాజెక్ట్, రైతుల సమస్యలపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు టీడీపీ నేతలు. అసెంబ్లీలో, మండలిలో వైసీపీ ఏకపక్షంగా వెళ్లకుండా అడ్డుకుంటామని అంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య, సీబీఐ ఎంక్వయిరీలో వెలుగు చూస్తున్న విషయాలు, అమరావతిపై హైకోర్టు తీర్పు, ఇటీవల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన ఉద్యోగుల సమ్మె.. తదితర అంశాలను అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రస్తావించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: