అమరావతి : సీనియర్లను తప్పించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యిందా ?

Vijaya



తెలుగుదేశంపార్టీకి ఇపుడు భారం ఎవరయ్యా అంటే సీనియర్లనే చెప్పాలి. సీనియర్లందరు కాకపోయినా చాలామంది మాత్రం బారంగానే తయారయ్యారు. వాళ్ళు యాక్టివ్ గా ఉండరు, ఎన్నికల్లో గెలవరు, అలాగని కొత్తతరాన్ని ప్రోత్సహించరు. దీంతోనే చాలామంది సీనియర్లు పార్టీకి డెడ్ వైట్ అయిపోయారనే టాక్ పార్టీలోనే నడుస్తోంది. చంద్రబాబునాయుడు కూడా ఎప్పటికప్పుడు పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహిస్తానని చెప్పటమే కానీ చేతల్లో చూపటంలేదు.



అయితే షెడ్యూల్ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళు మాత్రమే ఉన్న కారణంగా ఇప్పటి నుండే భారంగా తయారైన సీనియర్లను వదిలించుకోవాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లను తప్పించటానికి కొలమానం ఏమిటంటే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు అనుకున్నారట. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి అంటే ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళన్నమాట.



సోమిరెడ్డి వరసగా నాలుగు ఎన్నికల్లో,  యనమల సోదరులు మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇలాంటి సీనియర్లు ఓడిపోయిన నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయట. అలాంటి నియోజకవర్గాల్లో సీనియర్లను పక్కన పెట్టేసి కొత్తవాళ్ళని పోటీ చేయించాలనేది చంద్రబాబు ప్లాన్ గా చెబుతున్నారు. మరి కొత్తవాళ్ళంటే సీనియర్ల వారసులనే కొత్త నేతలుగా పరిచయం చేస్తారా ? లేకపోతే సీనియర్ల కుటుంబాలకు సంబంధం లేని పూర్తిగా కొత్తతరానికి టికెట్లిస్తారా అనేది చూడాలి.



ఏదేమైనా సంవత్సరాలుగా సీనియర్ల మొహాలను చూసి చూసి జనాలకే కాదు పార్టీ వాళ్ళకు కూడా మొహం మొత్తేసింది. అందుకనే సీనియర్లను పూర్తిగా దూరం పెట్టేస్తేకానీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడదన్నది వాస్తవం. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే లోకేష్ కు కూడా సీనియర్లతో ఇగో సమస్యలు పోతాయి. సీనియర్లను లోకేష్ తనదారిలోకి తెచ్చుకోలేక, అలాగని తాను వాళ్ళదారిలోకి వెళ్ళలేక లోకేష్ నానా అవస్తలు పడుతున్నారు.  టికెట్ల విషయంలో గట్టి ప్లాన్ అమలు చేస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయని చంద్రబాబు గట్టిగా అనుకున్నారట. మరి ఎంతవరకు అమలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: