టీఆర్ఎస్‌ వైపు జగ్గారెడ్డి చూపు!?

N.Hari
తెలంగాణ కాంగ్రెస్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన అధికార టీఆర్ఎస్‌ పార్టీకి దగ్గరవుతున్నారా? అనే అనుమానం బలపడేలా వ్యవహరిస్తున్నారని గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టి.కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వైఖరి కూడా వారి వాదనలకు బలం చేకూర్చేలా ఉంది. ఆయన సొంత పార్టీ ముఖ్య నేతల మీద విరుచుకుపడటంలో ఆంతర్యం ఏమిటని వారు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఎర్రవెల్లిలో రచ్చబండను ప్రకటిస్తే.. దాన్ని బహిష్కరిస్తున్నట్లుగా బహిరంగంగానే ప్రకటించి జగ్గారెడ్డి కాక రేపారు.  ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వరా? అని ఆయన ప్రశ్నించారు.
ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని మార్చాలని ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసి కలకలం రేపారు. పదే పదే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై జగ్గారెడ్డి చేస్తున్న ప్రకటనలు పార్టీ క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయట. ఈ క్రమంలోనే జగ్గారెడ్డిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసిన ఏఐసీసీ ఇన్‌ఛార్జి ఠాగూర్‌కే ఆయన ఝలక్‌ ఇచ్చారు. తానే పార్టీకి ఇబ్బందికరంగా మారానని అనుకుంటే.. ఇప్పుడే రాజీనామా చేస్తానని పీఏసీ సమావేశంలో ఇన్‌ఛార్జి ఠాగూర్‌కు జగ్గారెడ్డి తేల్చిచెప్పడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. ఈ వరుస పరిణామాలతో జగ్గారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది.
అధికార టీఆర్ఎస్‌లో చేరే వ్యూహంతోనే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేసేలా మాట్లాడుతున్నారని పార్టీలోని ఓ వర్గం వారు అనుమానిస్తున్నారు. కాగా, ఈ వాదనలను జగ్గారెడ్డి కొట్టిపారేస్తున్నారు. తాను పార్టీ శ్రేయస్సు, బాగు కోసమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నానని అంటున్నారు. టీఆర్ఎస్‌ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అసలు తాను ఏ పార్టీలోనూ చేరనని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఒకవేళ పార్టీని వీడే పరిస్థితే వస్తే.. తాను ఇండిపెండెంట్‌గా కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు. అసలు తానేం తప్పు చేశానని పార్టీ నుంచి బయటకు పంపుతారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు తన రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తానని జగ్గారెడ్డి కుండబద్ధలు కొట్టారు. మొత్తానికి జగ్గారెడ్డి మదిలో ఏముందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: