ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 10 `స్కోచ్` అవార్డులు..

Paloji Vinay
జాతీయ స్థాయిలో ప్ర‌క‌టించే `స్కోచ్‌` అవార్డుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఈ సారి 10 అవార్డులు వ‌రించాయి. స్కోచ్‌ గ్రూప్‌ 78వ ఎడిషన్‌లో భాగంగా ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే అత్యధిక అవార్డులు ఏపీ ద‌క్కించుకోవ‌డం విశేషం. స్కోచ్ అవార్డ్స్ కోసం దేశ‌ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ వ‌చ్చాయి. అందులో ఏపీ కి వివిధ కేటగిరిలలో ఐదు గోల్డ్, ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు వ‌రించాయి. గురువారం ఢిల్లీ నుంచి వెబినార్ నిర్వ‌హించ‌గా.. స్కోచ్‌ గ్రూప్‌ ఎండీ గురుషరన్ దంజల్‌ ఈ అవార్డులను ప్రకటించారు.

ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వైఎస్సార్ చేయూత, ఆసరా ప‌థ‌కం, నేతన్ననేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్ అవార్డులు ద‌క్కాయి.  ఎన్నికల వేళ వైఎస్సార్టీపీ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ చేయూత‌, ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో డ‌బ్బు వేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తోంది.

 వీటితో పాటు ఇటీవ‌ల ప్రారంభించిన `ఫిష్ ఆంధ్ర` కార్యక్రమానికి గోల్డ్ స్కోచ్ అవార్డు ద‌క్కింది. గిరిజన ప్రాంతాల్లో బలవర్థ‌కమైన ఆహారాన్ని సాగు చేస్తున్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు వ‌రించాయి. కొవిడ్‌-19 క‌ష్ట‌కాలంలో కూడా ఈ - ఫిష్, పశు సంరక్షక్, ఏపీ సీడ్స్, ప‌లు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న  గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, బయోవిలేజ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ `స్కోచ్` అవార్డులు ప్ర‌క‌టించారు.  వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీడ్స్‌ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లాల‌కు కలెక్టర్లు  స్కోచ్‌ అవార్డులను స్వీక‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: