జగన్, కేసీఆర్.. ఉద్యోగులతోనే ఇద్దరికీ ఇబ్బందులు..

Deekshitha Reddy
తెలంగాణలో ఉద్యోగుల బదిలీ జీవోపై రచ్చ జరుగుతోంది. బండి సంజయ్ అరెస్ట్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో ఉద్యోగుల బదిలీ వ్యవహారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో అస్తవ్యస్తంగా ఉందంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలతో బాధపడుతున్న ఉద్యోగులు కిమ్మనడంలేదు. కొంతమంది మాత్రం ధైర్యంగా తమ గొంతు వినిపిస్తున్నారు. ముల్కీ, నాన్ ముల్కీ తరహా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ అనుబంధ ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
నూతన జోనల్ విధానంలో భార్యా భర్తల బదిలీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఒకరు బదిలీ కోరుకున్నా సరిపోతుందని చెబుతున్నారు అధికారులు. భర్త పనిచేసే చోటుకి భార్య బదిలీ కోరుకుంటే.. అవకాశాన్ని పరిశీలిస్తారు. అది కుదరని పక్షంలో భార్య పనిచేసే చోటుకే భర్తని ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ రెండిటికీ అవకాశం లేకపోతే.. వారిద్దర్నీ కొత్త ప్రాంతానికి బదిలీ చేస్తారు. అయితే బదిలీల వ్యవహారం కాస్త గందరగోళంగా ఉందని, దీనివల్ల ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. బదిలీల నిబంధనలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గకపోతే 2023 ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలోనూ ఉద్యోగుల గొడవ..
ఇటు ఏపీలో కూడా ఉద్యోగుల సమస్యతోనే ప్రభుత్వం తల పట్టుకుంది. అయితే ఇక్కడ గొడవ బదిలీలతో కాదు, పీఆర్సీతో. పీఆర్సీ ప్రకటించడంలో ప్రభుత్వం చేసిన జాప్యానికి ఉద్యోగులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఐఆర్ ఇచ్చినా కూడా తాము నష్టపోతామని అంటున్నారు. ఫిట్ మెంట్ విషయంలో ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తోందని, జీతాలు పెరగకపోగా.. కొన్ని సందర్భాల్లో తగ్గే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీపీఎస్ రద్దుకోసం కూడా ఏపీలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు నిర్ణయించారు. అదే సమయంలో పీఆర్సీతో దోబూచులాడుతున్నారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం పీఆర్సీపై సానుకూలంగా స్పందించకపోతే.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఉద్యోగి అంటే ఒక్కరే కాదని, వారి కుటుంబానికి ఎన్ని ఓట్లు ఉంటాయో లెక్కేసుకోవాలని కూడా అధికార పార్టీకి సూచించారు.
మొత్తమ్మీద రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రులకి ఉద్యోగులతోనే తలనొప్పి మొదలైంది. తెలంగాణలో బదిలీల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారగా.. ఏపీలో మాత్రం పీఆర్సీతో జగన్ సర్కారు ఇరుకున పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: