టీడీపీలో ఇక అంతా యువనేతలే...!

Podili Ravindranath
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇకపై యువకుల చేతుల్లోకి వెళ్లనుంది. ఇదే విషయంపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు పలు అంచనాలు కూడా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని 1982లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతో మంది యువ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారంతా క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. అయితే ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత... పార్టీలో సీనియర్ల హవా కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో వారసుల హవా క్రమంగా పెరుగుతోంది. 1995లో చంద్రబాబుకు అండగా ఉన్న నేతలంతా కూడా పలు కీలక పదవులు అనుభవించారు. ఇప్పుడు వారి వారసులు రాజకీయాల్లో తన భవిష్యత్తును పరిక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా... మరికొందరు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పరిటాల శ్రీరామ్, కిమిడి నాగార్జున, చింతకాయల విజయ్ సహా పలువురు యువ నేతలు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసునిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు... వరుసగా రెండుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్‌కు బదులుగా... అసెంబ్లీకి పోటీ చేయాలని రామూ భావిస్తున్నారు. ఇక తండ్రి వారసునిగా వచ్చిన మరో నేత పరిటాల శ్రీరామ్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన శ్రీరామ్... అనూహ్యంగా ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రాజకీయ వారసునిగా కిమిడి నాగార్జున ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. కిమిడి మృణాళిని కుమారుడు అయిన నాగార్జున... రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక చింతకాయల విజయ్ కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: