కోర‌లు చాస్తున్న ఒమిక్రాన్..?

           క‌రోనా మ‌ళ్లీ కోర‌లు చాస్తోంది. కుదుట‌ప‌డింద‌నుకున్న ప్ర‌పంచాన్నికోలుకోనీయ‌కుండా చేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ రూపంలో ఐరోపాను వ‌ణికిస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికాను అత‌లాకుతలం చేస్తోంది. భార‌త్‌ను భ‌య‌పెడుతోంది. యూరోపియ‌న్ దేశ‌మైన బ్రిట‌న్‌లో ఇప్ప‌టికే ల‌క్ష‌కు పైగా రోజువారీ కేసులు న‌మోద‌వుతూ ఉండ‌గా అమెరికాలో క‌రోనా వేరియంట్లు, ఒమిక్రాన్ రూపంలో ఒకేరోజులో 4,40,000కు పైగా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.   వీటిలో దాదాపు 60 శాతం వ‌ర‌కు ఒమిక్రాన్ వైర‌స్ బాధితుల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల భ‌యం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం 2,969 విమానాలు ర‌ద్దుకాగా, 11, 500 స‌ర్వీసులు వాయిదా ప‌డ్డాయి. అమెరికాలో ఇప్ప‌టిదాకా ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే గ‌త ఏడాదిన్న‌ర‌గా సుమారు 50 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు కాగా 75,000 మందిని ఈ మ‌హమ్మారి బ‌లి తీసుకుంది.

 
           మ‌రోప‌క్క భార‌త్‌లోనూ ఒమిక్రాన్ ఉధృతి పెరుగుతోంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లోనూ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా మ‌హారాష్ట్ర‌లో బుధ‌వారం ఒక్క‌రోజే 85 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబ‌యిలోనే అత్య‌ధికం ఉన్నాయి. అంతేకాదు ముంబ‌యిలో క‌రోనా డెల్టా వేరియంట్ మ‌రోసారి చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. గ‌డ‌చిన 24 గంట‌ల్లోనే 2,500 కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. వారం క్రితం రోజుకు 150 మించి కేసులు ఉండేవి కాద‌ని ఈ సంఖ్య మ‌ళ్లీ 2 వేలు దాట‌డం నిజంగా ఆందోళ‌న‌క‌ర‌మేన‌ని, ప్ర‌జ‌ల్లో అత్య‌ధికులు కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోవ‌డంతోనే ఇది మ‌రోసారి ముప్పుగా మారింద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అంటోంది. ఇక ద‌క్షిణాది రాష్ట్రాల్లోను ఒమిక్రాన్ వ్యాప్తి క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే దీని ప్ర‌భావం క‌నిపిస్తుండ‌గా ఏపీలో సైతం బుధ‌వారం ఒక్క‌రోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్ప‌టికే కొత్త వేరియంట్ ఉధృతిని చ‌విచూస్తున్నబ్రిట‌న్‌, ద‌క్షిణాఫ్రికా దేశాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నాఆస్ప‌త్రుల్లో చేరాల్సిన స్థాయిలో ముప్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప్రాథ‌మికంగా తేల‌డం మాత్రం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: