టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్... జూనియర్ చుట్టూ చర్చ..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అలాగే వివాదాస్పద బిల్లులను రద్దు చేస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ప్రతిపక్ష నేతపైనే అధికార పార్టీ నేతలు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేశారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన భార్య భువనేశ్వరిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదనకు గురైన చంద్రబాబు... మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతే సభలో అడుగుపెడతా అంటు శపథం చేశారు. అన్నట్లుగానే వరద ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత పరిస్థితులపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు తప్పుబడుతూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇక ఇదే విషయంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే... ఇలాగే స్పందిస్తారా అని విమర్శించారు. మేనత్తపై మీకున్న అభిమానం ఇదేనా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు కూడా. ఇప్పుడు ఇదే అంశంపై పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. 2009 ఎన్నికల సమయంలో పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని... ఆ తర్వాత కూడా జరిగిన మహానాడు సమావేశాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే సినిమాల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారంటున్నారు టీడీపీ నేతలు. కానీ సొంత కుటుంబం విషయంలో కూడా జూనియర్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోందన్నారు. ఇదే విషయంపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: