వారం రోజులు స్కూల్స్ బంద్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

NAGARJUNA NAKKA
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వారం రోజుల పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రేపటి నుంచి ఈ నెల 17వరకు నిర్మాణ పనులు చేపట్టవద్దంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అవసరమైతే లాక్ డౌన్ పెట్టడంపై కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితి ఉందని.. ఇంట్రోనూ మాస్కులు ధరించాల్సి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. దీని వల్ల కరోనా, డెంగ్యూ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించవచ్చేమో ఆలోచించాలని కేంద్రానికి సూచించారు. వాయు కాలుష్య కట్టడికి ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు.
ఢిల్లీలో వాతావరణ సూచీని 500 నుంచి 200 పాయింట్లు ఎలా తగ్గించగలమనే దానిపై అత్యవసర చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలెలా బతుకుతారని ప్రశ్నించింది. ఉదయం 7గంటలకే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారని.. వారికేమైనా అయితే ఎవరిది బాధ్యత అని నిలదీసింది.వ్యవసాయ వ్యర్థాలను కాలుస్తున్నారని రైతులపై పడటం కాదనీ.. బాణసంచా నిషేధం ఎంత మేర అమలయిందో ఆలోచించుకోవాలంది.
మొత్తానికి ఢిల్లీలో కాలుష్యం చాలా ప్రమాదకరంగా మారింది. బయట అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది. ఇల్లు దాటి రాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: