బాబు అక్క‌డ పార్టీని బ్ర‌ష్టు ప‌ట్టించేస్తున్నారు.... చూస్తున్నావా...!

VUYYURU SUBHASH
ఔను.. రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన విజ‌య‌వాడ‌లో టీడీపీ రాజ‌కీయాలు భిన్నంగా మారుతున్నాయి. ఒక‌ప్పుడు ఉవ్వెత్త‌న ప‌రుగులు పెట్టిన సైకిల్‌.. ఇప్పుడు చ‌తికిల ప‌డింది. అంతేకాదు.. అస‌లు కోలుకుంటుందో లేదో.. అనే సందేహంలో త‌మ్ముళ్లు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా.. బెజ‌వాడ రాజ‌కీయాల‌పైనే టీడీపీ చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం.. ఎంపీ కేశినేని నాని! అంటూ.. త‌మ్ముళ్ల వేళ్లు ఆయ‌న‌వైపే చూపిస్తున్నాయి. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న నాని.. నిన్న మొన్న టి వ‌ర‌కు ఒంట‌రి పాలిటిక్స్ న‌డిపార‌నే పేరు తెచ్చుకున్నారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెకు ప‌ట్టుబ‌ట్టి.. మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు అధినేత వ‌ద్ద లాబీయింగ్ చేయ‌డం.. త‌ర్వాత‌.. స్థానిక నేత‌ల‌తో ఆయ‌న వైరం సాగించ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

విజ‌య‌వాడ న‌గ‌ర అధ్య‌క్షుడిగా..మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఉన్నారు. అయితే.. ఆయ‌న‌ను డామినేట్ చేసే రాజ‌కీయాల‌కు రెండేళ్ల కింద‌టే బీజాలు ప‌డ్డాయ‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ న‌డిచింది. ఈ క్ర‌మంలోనే ఎంపీ నాని.. ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీ యాల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా.. ఆయ‌న చంద్ర‌బాబును కూడా ధిక్క‌రించేలా వ్యాఖ్యానించ‌డంతో.. అంద‌రూ.. నానిని ప‌క్క‌న పెట్టి.. సొంత అజెండాల‌తో ముందుకు సాగారు. ఇది పెను వివాదంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, మ‌రో నాయ‌కుడు నాగుల్ మీరా వంటివారు.. నానికి వ్య‌తిరేకంగా.. కూట‌మిక‌ట్టారు. దీంతో నాని పాల్గొన్న కార్య‌క్ర‌మాల‌కు వీరు. వీరు పాల్గొన్న కార్య‌క్ర‌మాల‌కు నాని.. దూరంగా ఉన్నారు.

అయితే.. పార్టీ పరంగా చూసుకుంటే.. నాని క‌న్నా.. బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమా వంటివారు ప్ర‌భుత్వంపై బాగానే రెస్పాండ్ అయ్యారు. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలోను.. వైసీపీ నేత‌ల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డంలోనూ వారు ముందున్నారు. దీంతో వారు నిరంత‌రం.. పార్టీ ప‌క్షాన వాయిస్ వినించిన‌ట్ట‌యింది. ఒక్క‌నాని మిన‌హా.. అంద‌రూ యాక్టివ్‌గా ఉండేవారు. కానీ, ఇటీవల పార్టీ నేత ప‌ట్టాభి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడులు చేశారంటూ.. వ‌చ్చిన వివాదంతో.. మ‌ళ్లీ నాని ఏక‌మ‌య్యారు. చంద్ర‌బాబును బుజ్జ‌గించారో.. మంచి చేసుకున్నారో తెలియ‌దు.. కానీ.. ఆయ‌నకు మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌య్యా రు. చంద్ర‌బాబు దీక్షలో కూర్చుంటే.. ఆయ‌న ప‌క్క‌న కూర్చున్నారు.

అంతేకాదు.. చంద్ర‌బాబు రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేసిన స‌మ‌యంలోనూ ఢిల్లీ వ‌ర‌కు వెళ్లారు.. నాని. అక్క‌డ రాజ‌కీయాలు చ‌క్కబెట్టా రు. దీంతో మ‌ళ్లీ చంద్ర‌బాబు-నాని క‌లిసిపోయార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇది మంచి ప‌రిణామ‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. ఇంకేముంది.. బెజ‌వాడ టీడీపీలో ర‌గ‌డ పోయింద‌ని భావించారు. కానీ, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. నాని చంద్ర‌బాబుతో క‌లిసి ప‌ని చేస్తున్న నేప‌థ్యంలో మిగిలిన నాయ‌కులు సైలెంట్ అయిపోయారు. బుద్ధా వెంక‌న్న‌, నాగుల్‌మీరా స‌హా.. బోండా ఉమాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వారి మాట ఎక్క‌డా మీడియాలో వినిపించ‌డం లేదు. దీనికి ముందు.. నిత్యం మీడియాలో ఉండే బుద్దా వెంక‌న్న‌.. ఈ సీన్ త‌ర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. నాని రీఎంట్రీనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఫ‌లితంగా.. విజ‌య‌వాడ టీడీపీలో సెగ‌లు చ‌ల్లారిన‌ట్టు క‌నిపిస్తున్నా.. అంత‌ర్గ‌త చిచ్చు మాత్రం ఆర‌లేద‌నే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: