బద్వేల్ ఉప ఎన్నికను టీడీపీ బహిష్కరిస్తుందా..?

Deekshitha Reddy
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక వేడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. అంటే సరిగ్గా నెలరోజుల టైమ్ మాత్రమే ఉంది. పరిషత్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ.. గత ఎన్నికల్లో అన్నీ తప్పులు జరిగాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమ ప్రతాపం చూపిస్తామంటూ టీడీపీ నేతలు సవాళ్లు విసిరారు. వారి సవాళ్లు తర్వాత వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరిప్పుడు అదే మాటపై టీడీపీ నేతలు నిలబడతారో లేదో చూడాలి.
పార్టీ గుర్తులపై జరగని పంచాయతీ ఎన్నికల్లో దాదాపు సగం స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు టీడీపీ నేతలు. వైసీపీ మాత్రం తమకే 90శాతం సీట్లు దక్కాయని చెప్పింది. ఆ లెక్కలు పక్కనపెడితే.. పార్టీ గుర్తులతో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను టీడీపీ తాను బహిష్కరించానని చెప్పుకుంది. కానీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. జనసేన సపోర్ట్ తో ఒకటీ రెండు ఎంపీపీ స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతం బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక టీడీపీకి పెద్ద సవాల్ గా మారింది. బద్వేల్ లో అదికార వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక జరపాల్సి వస్తోంది. గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి కాకుండా.. డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఇచ్చి అందరికీ షాకిచ్చారు సీఎం జగన్. దుర్గా ప్రసాద్ తనయుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అయితే బద్వేల్ విషయంలో మాత్రం వెంకట సుబ్బయ్య సతీమణి సుధను అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఇక్కడ వైసీపీ చేసిన అభివృద్ధికి పడే ఓటుతోపాటు.. దివంగత ఎమ్మెల్యే కుటుంబంపై ఉన్న సింపతి కూడా వర్కవుట్ అయ్యే అవకాశముంది. దీంతో టీడీపీ డైలమాలో పడింది.
ఇప్పటికే టీడీపీ తరపున ఓబులాపురం రాజశేఖర్ ని బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. 2019లో సుబ్బయ్య చేతిలో రాజశేఖర్ 44,734 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్థానిక ఎన్నికల తర్వాత బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మరిప్పుడు టీడీపీ అక్కడ అభ్యర్థిని నిలబెడుతుందా.. పరిషత్ ఎన్నికల్లాగే పలాయనవాదం చిత్తగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇంకా టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. మరి చంద్రబాబు ఆలోచన  ఏంటో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: