తాలిబన్‌లలో వర్గపోరు షురూ!

N.Hari
ఆప్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సైనికులు వెళ్లిన తర్వాత తాలిబన్‌లలో వర్గపోరు మొదలైంది. ఆధిపత్య పోరాటంలో ఖతార్‌ వర్సెస్‌ పాక్‌ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తాలిబన్‌లలో తన వర్గాన్ని ఎగదోసేందుకు పాకిస్థాన్‌ జోరుగా పావులు కదుపుతోంది. ఆప్ఘనిస్థాన్‌ను చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్‌లు గ్రూపులుగా విడిపోయారు. ఇటు ఖతార్‌, అటు పాకిస్థాన్‌ గ్రూపులుగా వారు డివైడ్‌ అయి ఆధిపత్యం కోసం గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్ష భవనాన్ని వేదికగా చేసుకుని ఇరువర్గాల వారు పోట్లాడుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ గొడవ తర్వాతే తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్‌ అదృశ్యం అయిపోయినట్లు సమాచారం. ఓ స్థాయిలో ముల్లా బరాదర్‌ చనిపోయినట్లు కూడా చర్చ జోరందుకుంది. కానీ ఓ ఆడియో క్లిప్పుతో ముల్లా బరాదర్‌ బతికే ఉన్నట్లు రూఢీ అయింది. అయితే ఖతార్‌ సర్కారుతో తాలిబన్‌ల సర్కారు నిర్వహించిన చర్చలకు ముల్లా బరాదర్‌ రాకపోవడం గమనార్హం.
ఆఫ్ఘనిస్థాన్‌లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం కోసమే తాలిబన్‌ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అమెరికా ఆర్మీ ఆ దేశం వెళ్లడానికి తానే కారణమని ముల్లా బరాదర్ భావిస్తున్నారు. అయితే తాము యుద్ధం చేసినందుకే అమెరికన్‌లు వెళ్లారన్నది ఖలీల్ హక్కానీ వర్గం వాదనగా ఉంది. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. విషయం పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లింది. ఈ ఘటన అనంతరం మంత్రివర్గ కూర్పుపైనా ముల్లా బరాదర్ అలిగారని తెలుస్తోంది.
మరోవైపు ముల్లా బరాదర్‌కు ఖతార్‌తో సత్సంబంధాలున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ భవిష్యత్‌ నేతగా ముల్లా బరాదర్‌ను ఖతార్‌ సర్కారు చూపెట్టింది. తాలిబన్‌లపై ప్రపంచానికి సదాభిప్రాయం కలిగించేలా యత్నించింది. గతంలో పాకిస్థాన్‌ పెత్తనంలోని తాలిబన్ల అరాచకాలు చూసిన ప్రపంచ దేశాలు సైతం.. ఖతార్ మద్దతుతో మార్పు వస్తుందన్న అంచనాకు వచ్చాయి. ఖతార్‌ ద్వారానే ఆప్ఘనిస్థాన్‌కు చేయూత ఇస్తున్నాయి. అయితే పాక్‌ను మాత్రం పలు దేశాలు విశ్వసించడం లేదు. ఈ పరిణామాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. సొంత ప్రయోజనార్థం తన వర్గాన్ని రెచ్చగొట్టే పనిలో పడింది. ఆప్ఘనిస్థాన్‌ను టెర్రరిస్టులకు నిలయంగా చేయాలని ప్రణాళిక రచిస్తోంది. గతంలో ముల్లా బరాదర్‌ను పాకిస్థాన్‌ రెండు సంవత్సరాల పాటు అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేసింది. ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపి భారత్‌పై ఉసిగొల్పాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఆప్ఘనిస్థాన్‌పై ఖతార్‌కు పట్టు ఉండరాదని శాయశక్తులా కృషి చేస్తోంది. చాలా వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: