వారం గడిచినా పూర్తిగా పడని జీతాలు, పెన్షన్లు!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గత నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ప్రతినెలా 15వ తేదీ వరకు అందుతూనే ఉన్నాయి. ఈనెల కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ప్రస్తుత మాసంలో మొదటి వారం గడిచిపోయినా.. ఇంకా 20 శాతం మందికి జీతాలు పడలేదని ఉద్యోగ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు ముఖ్యంగా నవరత్నాలకు నగదు బదిలీతో అభివృద్ధి పథకాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి సుమారు రూ. 70 వేల కోట్లు మేర బిల్లులు పెండింగులో ఉన్నాయి. తాజాగా బిల్లులను అప్‌లోడ్ చేసేందుకు సీఎఫ్ఎంఎస్‌లో ఉన్న ఆప్షన్ కూడా లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టర్లు ఎవరూ కూడా రాష్ట్రంలో తాజాగా పిలుస్తున్న టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. ఆర్.అండ్.బి టెండర్లకు ఇదే గతి పట్టింది. ఇప్పుడు తాజాగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి వెళ్లింది.
రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రతినెలా రూ.500 కోట్లు అవసరమవుతాయి. ఇవి కాకుండా నెలలో ఒకటో తేదీ నాటికి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద రూ.1500 కోట్లు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లింపు కింద రూ.4,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఒకటో తేదీ నాటికి రూ.11,500 కోట్లు ఖజానాలో ఉండి తీరాల్సిందే. రుణాలకు వడ్డీల చెల్లింపుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు తమ వద్ద నుంచి ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా మినహాయించేస్తుంది. సెప్టెంబర్ లో జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు గతనెల 31న రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి రూ.వెయ్యి కోట్లు తీసుకువచ్చారు. తొలుత రాష్ట్ర సచివాలయం, ఆ తర్వాత శాఖాధిపతుల కార్యాలయాలు, అనంతరం జిల్లాలకు విడుదల చేస్తున్నారు. సెప్టెంబరులో పదో తేదీ నాటికి జీతాలు పెన్షన్లు పంపిణీ పూర్తవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లింపులో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: