చంద్రబాబు లేకపోతే అచ్చెన్నాయుడు..!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో ప్రతిపక్షంలోని తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా పటిష్టం కావడంపై దృష్టి సారించింది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జిలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నేతలు, కార్యకర్తలతో హడావుడిగా కనిపిస్తోంది. వీరికి అందుబాటులో ఉండాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక వారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, మరో వారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, క్రమశిక్షణా చర్యలను పెండింగులో ఉంచడం ఇక ముందు జరగకూడదని నిర్ణయించారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని సంకల్పించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడు నెలల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, సంస్థాగతంగా పటిష్టం కావడంపై చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడులు దృష్టి సారించారు. నిత్యం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు చెప్పిన అంశాలు, పార్టీ కార్యక్రమాలపై వారితో చర్చించనున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో అంత క్రీయాశీలకంగా లేని పార్టీ ఇన్‌ఛార్జిలను కూడా రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురిని పిలిచి పనితీరు మెరుగు పరచుకోకపోతే తప్పించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించి పంపారని సమాచారం.
నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు వీటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, దానిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి గ్రామస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇక చంద్రబాబు, అచ్చెంనాయుడు కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: