బుచ్చయ్య చౌదరి మౌనం.. ఫలించిన బాబు వ్యూహం..

Deekshitha Reddy
టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం టీ కప్పులో తుపానులా ముగిసిపోయిందని తెలుస్తోంది. 25వతేదీ అంతా తేల్చేస్తారంటూ, బుచ్చయ్య తరపున ప్రకటన విడుదల అవుతుందంటూ కథనాలొచ్చినా అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది. టీవీ డిబేట్లలో.. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు గుప్పించిన బుచ్చయ్య ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం ఆయన తరపున కూడా ఎవరూ ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వలేదు. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం ఫలించినట్టయింది.
గతంలో టీడీపీలోకి వలసల విషయంలో తన మాట చంద్రబాబు లక్ష్యపెట్టలేదని, మంచి చెప్పినందుకు తనను పక్కనపెట్టారని, తన ఫోన్లు కూడా ఎత్తడం లేదనేది బుచ్చయ్య చౌదరి ఆరోపణ. అప్పటికే పార్టీ వ్యవహారంతో విసిగిపోయిన ఆయన.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారనే వార్తలొచ్చాయి. అవేవీ పుకార్లు కావాని, ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి టీవీ డిబేట్లలో కుండ బద్దలు కొట్టారు. తనను ఎలా అవమానించిందీ బయటపెట్టారు. అంతేకానీ రాజీనామా విషయాలపై స్పందించలేదు. ఆ ముహూర్తం ఆగస్ట్ 25న ఉంటుందని అన్నారు.
ఈలోగా చంద్రబాబు బుచ్చయ్య వద్దకు రాయబారం పంపారు. సహజంగా బుచ్చయ్యలాంటి సీనియర్లు అలిగితే, అధినేత నేరుగా వెళ్లాల్సిన సందర్భం. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. ఏపీలో సీనియర్ నాయకుల్ని ఆయన వద్దకు పంపి మేటర్ సెటిల్ చేశారు. అటు పార్టీ తరపున కూడా ఎలాంటి స్టేట్ మెంట్ బయటకు రాలేదు. ఇటు బుచ్చయ్యనుంచి కూడా రెండు రోజులుగా ఎలాంటి హడావిడి లేదు. కనీసం ఆయన తన కార్యకర్తలు, అనుయాయులతో మీటింగ్ కూడా పెట్టుకోలేదు. సన్నిహితులతో చర్చించకుండా కీలక నిర్ణయాన్ని ఏ నాయకుడూ ప్రకటించరు. సో.. బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే చెప్పుకోవాలి.
లాభనష్టాలు బేరీజు వేసుకున్నారా..?
ఇప్పటికిప్పుడు బుచ్చయ్య చౌదరి పార్టీ మారితే కలిగే ప్రయోజనం ఏంటి..? వైసీపీలోకి వెళ్దామనుకుంటే రాజీనామా చేసి రమ్మంటారు. రాజీనామా చేసి మళ్లీ పోటీకి దిగడమంటే సాహసమేనని చెప్పాలి. పోనీ బీజేపీలోకి వెళ్దామంటే వచ్చే ఎన్నికలనాటికయినా ఆ పార్టీ పరిస్థితి చక్కబడుతుందో లేదో తెలియదు. దీంతో లాభనష్టాలన్నీ బేరీజు వేసుకుని బుచ్చయ్య సైలెంట్ అయ్యారని అంటున్నారంతా. ప్రస్తుతానికి ఆయన టీడీపీలోనే ఉండటానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: