రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. ప్రయాణీకులకు ఊరట..!

NAGARJUNA NAKKA
రైళ్లలో ప్రయాణీకుల లగేజీ చోరీ అయితే రైల్వే శాఖదే బాధ్యత అని వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 2017లో యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో బెంగళూరు వెళ్తుండగా.. ఆభరణాలు, 3లక్షల రూపాయల నగదు చోరీ అయ్యాయి.  దీనిపై రైల్వే పోలీసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. నగల విలువ 14లక్షల రూపాయలు, 3లక్షల రూపాయల నగదు, 9శాతం వడ్డీతో కలిపి 45రోజుల్లో చెల్లించాలని వినియోగదారుల ఫోరం రైల్వేను ఆదేశించింది.
ఇక నుంచి రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ అవసరం లేదు. కరోనా కారణంగా ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు సడలింపులు ఇస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 74రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. బుకింగ్ కౌంటర్లలో అన్ రిజర్వ్ డ్ టికెన్ తీసుకొని ప్రయాణించవచ్చని తెలిపింది.
మరోవైపు ఉన్నత సౌకర్యాలతో ప్రవేశపెట్టిన తేజస్ రైలు.. ఆలస్యంగా నడవడంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూలు చేసిన ఫీజును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. 1574మంది ప్రయాణీకులకు 250రూపాయల చొప్పున 3లక్షల 93వేల 500రూపాయలు చెల్లించింది ఐఆర్ సీటీసీ. ఈ నెల 21న లక్నో నుంచి బయల్దేరిన రైలు.. 2.5గంటలు ఆలస్యంగా ఢిల్లీ చేరింది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగా లేట్ అయిందని తెలిపినా ప్రయాణీకులు గొడవ చేయడంతో.. ఐఆర్ సీటీసీ కొంత మొత్తం ఇచ్చేసింది.

అంతేకాదు రైళ్లలో శుభ్రతపై కూడా రైల్వే శాఖ దృష్టి సారిస్తోంది. ప్రయాణానికి ముందు శానిటైజేషన్ చేస్తోంది. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుతూ ప్యాసింజర్లకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది.మొత్తానికి రైల్వేశాఖ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ప్రయాణీకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అంతేకాదు రైలు ప్రయాణంపై ఆసక్తిని కలిగించేలా చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: