అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు అందుకేనా?

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ వర్షాకాల సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల కాలంలో జగన్‌ సర్కారుని వరుసగా చుట్టుముడుతున్న వివాదాలు, ఆర్ధిక కష్టాలు, నడి రోడ్డుపై యువతుల దారుణ హత్య, గ్యాంగ్ రేప్‌లు, యువతిపై పెట్రోల్ పోసి దగ్ధం చేసే ప్రయత్నాలు వంటి ఘటనలు ప్రభుత్వంపై ప్రతిపక్షాల ముప్పేట దాడికి కారణమయ్యాయి. మరోవైపు జాబ్ క్యాలెండర్‌పై విద్యార్ది, యువజన సంఘాల నిరసన కార్యక్రమం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు స్వరం పెంచడం, నిన్న మొన్నటి వరకు వైసీపీకి మిత్ర పక్షంగా ప్రచారం జరిగిన పక్షాలు కూడా గొంతును పెంచుతున్నాయి. ప్రభుత్వంపై విద్యుత్ మీటర్లు, ఆర్ధిక కష్టాలు, జాబ్ క్యాలెండర్, రాజధాని అంశాలు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్వరాన్ని వినిపించాలని, అప్పుల బాధలకు గత ప్రభుత్వం కారణమనే అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని అధికార పక్షం భావిస్తోంది. దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొర్రీలతో వెనక్కి పంపించడం, సవరణలు చేస్తూ చట్టానికి ఆమోదం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంపై కూడా పెద్దఎత్తున విమర్శలు వస్తుండటంతో అసెంబ్లీ వేదికగా తిప్పి కొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదిలావుంటే, జగన్ అక్రమాస్తుల కేసులో సెప్టెంబరు 22వ తేదీన ఈడీ కోర్టు విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి నోటీసులు పంపింది. వాన్‌పిక్‌తో పాటు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. నిన్నమొన్నటి దాకా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, సీబీఐ కేసులు మొదటి విచారణ జరపాలని, ఆ తర్వాతనే ఈడీ కేసులు విచారణ నిర్వహించాలని హైకోర్టులో వేసిన పిటీషన్‌ను కొట్టి వేయడంతో ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. దీంతో ఈడీ సెప్టెంబరు 22న జగన్‌తో పాటు మరో 22మందికి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కోర్టు విచారణకు గైర్హాజరు అయ్యేందుకు అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపించబోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. ఈడీ కోర్టు విచారణ అనగానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారని ఆయన విమర్శించారు. మొత్తం మీద అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: