హాల్ మార్క్ వద్దు.. మా వ్యాపారాన్ని దెబ్బతీయొద్దు..

Deekshitha Reddy
పెద్ద నోట్ల రద్దుతో ప్రశాంతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకి లోనైంది. జీఎస్టీతో చిరు వ్యాపారులు సతమతం అవుతూనే ఊన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బంగారు వ్యాపారులు కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
ఎందుకీ హాల్ మార్క్..?
ప్రస్తుతం బంగారం అమ్మకం, కొనుగోలు ఎక్కువశాతం ప్రభుత్వ  లెక్కల్లోకి రావడంలేదు, పేరున్న కంపెనీలు మాత్రమే ప్రతి నగకీ జీఎస్టీ సహా బిల్లుని ఇస్తాయి. హాల్ మార్క్ నగలని మాత్రమే అమ్ముతాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో చిన్న చిన్న పట్టణాల్లో కూడా హాల్ మార్క్ నగలనే బంగారు షాపులవారు అమ్ముతున్నారు. అయితే ఇక్కడే చిన్న మతలబు ఉంది. నగలపై హాల్ మార్క్ ఉంటుంది కానీ, ఆ హాల్ మార్క్ కి, ఆ నగలు అమ్మే షాపుకి సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి షాపుకి హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటోంది. దీంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓ స్థాయి పట్టణాల్లో కూడా జీఎస్టీ లేకుండానే వ్యాపారులు నగలు అమ్ముతున్నారు. ఇకపై జీఎస్టీ లేకపోయినా, హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ లేకపోయినా నగలు అమ్మడానికి లేదు. ఈ నిబంధనల అమలులో భాగంగా తొలి దశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని.. మొత్తం 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుంత ఆయా జిల్లాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయి కూడా. త్వరలో దీన్ని దేశవ్యాప్తం చేయాలని చూస్తోంది కేంద్రం. వ్యాపార వర్గాలు మాత్రం ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కార్పొరేట్ కంపెనీలకోసమేనా..?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ కంపెనీలకోసమేనంటూ బంగారు వ్యాపారులు మండిపడుతున్నారు. చిన్న చిన్న షాపులు లేకుండా చేయాలని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం హాల్ మార్క్ అనేది వినియోగదారుడి భద్రతకోసమేనని చెబుతోంది. నాణ్యమైన బంగారు ఆభరణాల అమ్మకాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. బంగారం బ్లాక్ మార్కెట్ ని తగ్గించేందుకే ఈ ప్రయత్నం అంటూ వివరణ ఇస్తోంది.
సమ్మెకు పిలుపునిచ్చిన వ్యాపార సంఘాలు..
హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్రం చర్యలు తమకు నష్టం కలిగిస్తున్నాయంటూ ఆలిండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ సమ్మెకు పిలుపునిచ్చింది. రేపు దేశవ్యాప్తంగా చిన్న చిన్న బంగారు షాపుల వారంతా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేలా లేదు. హాల్ మార్క్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తేవాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: