నిరుద్యోగుల కోసం మొద‌ట‌ కొట్లాడింది మేమే : ష‌ర్మిల‌

నిరుద్యోగంపై మొద‌ట ప్ర‌శ్నించింది తామేన‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రాజన్న సంక్షేమ పాలనను రాష్ట్రంలో మళ్ళీ తీసుకొచ్చే జెండా మన వైస్సార్ టిపి జెండా అంటూ చెప్పారు. సంక్షేమ పథకాలంటే వైస్సార్ గుర్తుకు వస్తారని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనా మళ్ళీ తిరిగిరాబోతుందని ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరారు. పల్లెపల్లెలో పాలపిట్ట రంగు జెండా ఎగరాలని ష‌ర్మిల అన్నారు. పాలపిట్ట రంగు జెండా చూస్తే వైఎస్ ఆర్ మ‌న‌కు గుర్తుకురావాలంటూ వ్యాఖ్యానించారు.సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం ఇవే త‌మ‌ పార్టీ ఎజెండా అంటూ ష‌ర్మిల చెప్పుకొచ్చారు. సంక్షేమానికి చెరగని చిరునామా వైఎస్ ఆర్ అని అన్నారు. నీలం రంగు సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేద్కర్ వాదమే తమ నినాదం అంటూ చెప్పారు. పాలపిట్ట రంగు విజయానికి చిరునామా అని తెలిపారు. దసరా రోజు పాలపిట్ట ను చూస్తే ఎంత సంతోషిస్తారో.. మన జెండాను చుసిన అంతకంటే ఎక్కువ సంతోషం కలగాలని అన్నారు. 

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ ఆర్ కే దక్కుతుందని చెప్పారు. ఆయన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రతిఒక్కరికీ పాలపిట్ట రంగు జెండా చేరేలా కార్యాచరణ రూపొందిస్తామ‌ని చెప్పారు. ప్రతిపల్లె పాలపిట్ట రంగు పులుముకోవాలని ష‌ర్మిల అన్నారు. నెలరోజులపాటు ఒక పండుగలా రాజన్న యాదిలో జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు. వైస్సార్ జెండాను గర్వంగా ఎత్తుకొని సంక్షేమ పాలనా దిశగా అడుగులు వేద్దామ‌ని ష‌ర్మిల కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. 35 ఏళ్లలోపు ఉన్నవారందరికీ కలిసి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని, రాజన్న సంక్షేమపాలన యెట్లా ఉండేదో చెప్పాలని తెలిపారు. 35 ఏళ్ళు పై బడినవారిని కలిసి వైఎస్ఆర్ పాలనలో ఎలా లబ్ధిపొందారో గుర్తు చేయాలని అన్నారు. రాజన్న సంక్షేమ పథకం అందని కుటుంబం రాష్ట్రంలో లేద‌ని ష‌ర్మిల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పటిపాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని...ఒక్క ఎకరం కూడా ఎండొద్దని కలలు కన్నది వైస్సార్ అని ప్రజలకు చెప్పాల‌ని అన్నారు.

నిరుద్యోగం పై మొదట ప్రశ్నించింది తామేన‌ని.. ఆ తర్వాతే ప్రభుత్వం, ప్రతిపక్షం మేల్కొన్నాయ‌ని చెప్పారు. పార్టీ లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసామ‌ని ష‌ర్మిల తెలిపారు. నాయకుడు కావాలని అనుకునే ప్రతిఒక్కరూ ప్రజల పక్షాన పోరాడితేనే ప్రజలు మనవైపు నిలబడతారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని ష‌ర్మిల పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గం నుండి వార్డు స్థాయివరకు పార్టీ బలోపేతం చేయ‌డం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. వెనకడుగు వేయకుండా ప్రజల కష్టాలను తీర్చాల‌ని ష‌ర్మిల కోరారు. ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యపై పోరాడేవారినే ప్రజలు అక్కున చేర్చుకుంటారని స్ప‌ష్టం చేశారు. వైఎస్ ఆర్ స్పూర్తితో మనమంతా పోరాటాలు చేద్దాం అని కార్య‌క‌ర్త‌ల‌కు తెలిపారు. కష్టపడి పనిచేసే వారందరికీ తగిన స్థానం కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ స్వర్గస్థులైనప్పటి నుండి 12ఏళ్లుగా వైఎస్ ఆర్ అభిమానులు త‌మ‌కు అండగా నిలిచారని, వారందరికీ ష‌ర్మిల ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని వైఎస్ ఆర్ అభిమానులను గాలికి వదిలేసారని ష‌ర్మిల ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: