ఒక్క దెబ్బకు రూ.42కోట్ల నష్టం..!

NAGARJUNA NAKKA
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 11ప్రాంతాల్లో సుమారు 3.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో సంస్థకు రూ.42కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. గతేడాది కూడా ఈ సమయంలో కరోనా, వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ఈ సారి కూడా వర్ష ప్రభావంతో క్వారీల్లో భారీగా నీరు చేరిందని వెల్లడించారు.
మరోవైపు ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు ప్రదేశాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బీహార్ వైపు వెళ్ల.. బలహీనపడినట్టు వివరించింది. అయినా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారగా.. జురాల, తుంగభద్ర రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఈ రోజు తుంగభద్ర జలాశయం గేట్లను కర్ణాటక ప్రభుత్వం ఎత్తే అవకాశం ఉండగా.. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ.. తెలంగాణ, ఏపీ అధికారులను కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ఇక ఎగువన కురుస్తున్న వర్షాల దెబ్బకు గోదావరిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత నీటిమట్టం 48అడుగులకు చేరడంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కూనవరం మండలం పోలిపాక దగ్గర గోదావరి వరదనీరు రోడ్లపైకి చేరింది. పర్ణశాలను నీరు చుట్టుముట్టింది. నారచీరల ప్రాంతంలోని సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: