రైలుపై విరిగిపడిన కొండచరియలు

Podili Ravindranath
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు భారత వాతావారణ శాఖ హై రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అటు కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం భారీ వర్షానికి తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. మంగళూరు నుంచి ముంబై వెళ్తున్న రైలుపై కొండచరియలు విరిగిపడ్డాయి. గోవా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు కొంకణ్ రైల్వే ప్రకటించింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మృతిచెందలేదు.

 
మంగళూరు జంక్షన్ నుంచి ముంబై సీఎస్టీ వెళ్లే నంబర్ 01134 రైలును భారీ వర్షాల కారణంగా మడ్గావ్, లోండా, మిర్జా మీదుగా దారి మళ్లించారు అధికారులు. అయితే ఈ రైలు వశిష్ట నదీ సమీపంలో ప్రమాదానికి గురైంది. నదీ ఉధృతంగా  ప్రవహిస్తున్న కారణంగా కొండచరియలు విరిగి రైలుపై పడ్డాయి. దూద్ సాగర్, సోనాలిమ్ స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగినట్లు కొంకణ్ రైల్వే ప్రకటించింది. రైలులోని ఎస్ 5 కోచ్ మట్టిలో కూరుకుపోయింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. అయితే ఓ వైపు భారీ వర్షం సహాయచర్యలకు ఆటంకం కలిగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మార్గంలో అన్ని రైళ్లను కొంకణ్ రైల్వే రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ. వాస్కో - హౌరా మధ్య నడిచే 08048నంబర్ రైలు, వాస్కో - తిరుపతి మధ్య నడిచే 07420 నంబర్ రైలు, హజ్రత్ నిజాముద్దీన్ - వాస్కో మద్య నడిచే 02780 రైలుతో పాటు వాస్కో - తిరుపతి- హైదరాబాద్ మధ్య నడిచే 07420/07022 ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరోవైపు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: