పొగాకు రైతులపై ఆమెకు ఎందుకంత ప్రేమ!

Krishna A.B
ప్రాణం ఎవ్వరిదైనా దాని విలువ ఒక్కటే. రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఏ రైతు కుటుంబంలో అయిన పొంగే కన్నీళ్లు ఒక్కటే.. ఛిద్రమయ్యే జీవితాలలో దైన్యం ఒక్కటే..! కానీ మోడీ సర్కారులోని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు మాత్రం.. పొగాకు రైతుల ఆత్మహత్యలు అంటే.. చాలా కీలకమైనవిగా కనిపిస్తున్నట్లున్నది. ఒకవైపు తెలంగాణలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటే... అన్నదాతల స్థితిగతులు బాగోలేక.. కడతేరిపోతూ ఉంటే.. ఇప్పటిదాకా ఎన్నడూ పెదవివిప్పని కేంద్రమంత్రి.. పొగాకు రైతుల విషయంలో చాలా సానుభూతితో స్పందిస్తున్నారు. ఆత్మహత్యలు తన దృష్టికి రాగానే.. వెంటనే ఈనెల 18న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు కూడా షెడ్యూలు నిర్ణయించేసుకున్నారు.


పొగాకు రైతులు డీలా పడాల్సిన అవసరమే లేదని.. ఈ సీజనులో 172 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యం కాగా, ఇంకా 31 మిలియన్‌కిలోలు సేకరించాల్సి ఉన్నదని.. రైతులనుంచి ఖచ్చితంగా కొనడం జరుగుతుందని ఆమె చెబుతున్నారు. పైగా.. అనధికారికంగా రైతులు సాగుచేసిన మరో 21 మిలియన్‌ కిలోల పొగాకును కూడా కొనడానికి ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల రైతులు నిర్భయంగా ఉండొచ్చునని, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు. అనధికారికంగా పొగాకు పండించిన రైతులే నష్టపోతున్నారని ఆమె చెప్పడం గమనార్హం. 


ఇదంతా ఒక ఎత్తు అయితే.. పొగాకు రైతుల మరణాలను మాత్రం పరామర్శించడానికి కేంద్ర మంత్రి ఉరుకులు పరుగుల మీద రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఒకవైపు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. కనీసం ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా వెళ్లి పరామర్శించలేదు. కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా కేంద్రమంత్రులకు ఈ వివక్ష ఏమిటో అర్థం కావడం లేదని.. తాను ఏపీ నుంచి ఎన్నికైన రాజ్యసభ ఎంపీని గనుక.. ఏపీలో ఆత్మహత్యలను మాత్రం పరామర్శించాలని నిర్మల సీతారామన్‌ అనుకుంటున్నారేమో బోధపడడం లేదని జనం విస్తుపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: