ఆ విషయంలో ఏపీ సర్కారుదే పైచేయి

Krishna A.B
ఒక విషయంలో మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు మీద స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రజల, ప్రధానంగా రైతుల సమస్యల పట్ల సానుభూతితో, సానుకూల దృక్పథంతో, మానవత్వంతో స్పందించడంలో తమదే పైచేయి అని చంద్రబాబు సర్కారు నిరూపించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను రైతుల పరిస్థితులు చాలా దయనీయంగా మారిపోతున్నాయి. రెండు చోట్ల కూడా రైతులు.. కష్టాల సుడిగుండాన్ని దాటలేక, తమ జీవితాలను కడతేర్చుకుంటూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే రైతుల ఆత్మహత్యలను కించపరచకుండా వారి సమస్యల పట్ల సానుకూలంతో స్పందించడంలో ఏపీ సర్కారే ముందంజలో ఉంది. 


ఉదాహరణకు లింబయ్య అనే రైతు రాజధానికి వచ్చిన ఇక్కడ ట్యాంక్‌బండ్‌లో నిల్చున్న గౌతమబుద్ధుడి సాక్షగా, గట్టున ఉరేసుకుని చచ్చిపోయాడు. అయితే.. లింబయ్య అది రైతు ఆత్మహత్య కేటగిరీ కిందకు రానే రాదని, అసలు ఆయన వడ్డీవ్యాపారి కూడా అని పేర్కొంటూ తెలంగాణ సర్కారు నానా రకాల వాదనలను వండి వార్చింది. కేవలం ఈ వాదనల సంగతి మాత్రమే కాదు.... అసలు ఆత్మహత్యలకు పాల్పడిన ఏ రైతు కుటుంబం వద్దకైనా వెళ్లి పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి అధికార పార్టీలోని సీఎం, మంత్రులు ఎవ్వరికీ ఖాళీ దొరకడం లేదు. 


అదే ఏపీ విషయానికి వస్తే.. అక్కడ కూడా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొదవారిపాలెంలో కృష్ణారావు అనే పొగాకు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏవిధంగా సాకులు చెప్పి తప్పించుకోవాలా అని ప్రభుత్వం మార్గాలు వెతకలేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇద్దరూ కలిసి వారి ఇంటికి వెళ్లి బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా 1.5 లక్షలు ఇస్తున్నామని, మరో 3.5 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తామని హమీ ఇచ్చారు. 


పొగాకు రైతులు ఆత్మస్థైర్యం కోల్పో వద్దని మంత్రులు హితవు చెప్పారు. పొగాకు రేట్లు పడిపోవడం, నాణ్యత తగ్గిన పొగాకుకు ధరలు లేకపోవడం.. రైతుల్లో నిరాశకు కారణాలుగా గుర్తించిన మంత్రులు.., నాణ్యత తక్కువైన పొగాకుకు కూడా ధర నిర్ణయించి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామన్నారు. ఇలాంటి నిర్ణయాలను ప్రకటించడం ద్వారా మిగిలిన రైతుల్లో కూడా ఒక భరోసాని నింపి, జీవితం పట్ల ఆశ పుట్టేలా చేయగలిగారు. అందుకే ఈ విషయంలో తెలంగాణ సర్కారు కంటే.. చంద్రబాబు సర్కారు ఒకఅడుగు ముందంజలోనే ఉన్నదని చెప్పుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: