కేసీఆర్‌ : కొంచెం నీరు... కొంచెం నిప్పు!

Krishna A.B
కేసీఆర్‌ తనలో భిన్న కోణాలు ఉన్నాయని తరచూ నిరూపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఒక చేత్తో కొంత మంచి చేస్తూనే.. మరో చేత్తో కొరడా ఝళిపించడం ద్వారా.. కేసీఆర్‌.. కొంచెం నీరు- కొంచెం నిప్పు సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. రోజులతరబడి సమ్మెలో ఉండి.. నగరాన్ని పారిశుధ్యం పరంగా అధ్వానంగా తయారుచేసిన కార్మికులకు ఒకవైపు వేతనాల్ని భారీగా పెంచుతూనే.. మరోవైపు ఈ దశలో మాట వినని వారిని, సమ్మెలో దూకుడుగా వ్యవహరించిన వారిని తక్షణం విధుల్లోంచి తొలగించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం విశేషం. 


తెలంగాణలో పారిశుధ్య కార్మికులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్రమంతా వేతనాల పెంపుగురించి కార్మికుల సమ్మెతో అట్టుడికిపోతోంది. పట్టణాలన్నీ దుర్గంధభరితంగా తయారవుతున్నాయి. పరిస్థితి తీవ్రం అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం నాటికి కేవలం హైదరాబాదు నగర పరిధికి సంబంధించినంత వరకు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని 24వేల మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ధి చేకూరేలాగా వారి వేతనాల్ని 47 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. 
అయితే ఆయన నిర్ణయంలో కాస్త తీపి,కాస్త చేదు ఏంటంటే.. ఒకవైపు వేతనాలు పెంచుతూనే.. గురువారంలోగా విధుల్లోకి రాని వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగించేయాలంటూ కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వడం. 


అయితే ఒకవైపు వేతనాలు పెంచుతూనే.. కేసీఆర్‌ ఇచ్చిన ఝలక్‌ ఏంటంటే.. సమ్మె సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడిన వారిని, అనుచితంగా ప్రవర్తించిన వారిని విధులనుంచి తక్షణం తొలగించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే సమ్మెలు, ఉద్యమాల సందర్భంగా కొన్ని చేయిదాటిన పరిస్థితులు ఏర్పడడం సహజం. తెలంగాణ రాష్ట్రం కోసం సంవత్సరాల తరబడి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌కు ఇది తెలియని సంగతేమీ కాదు. తెలంగాణ ఉద్యమకాలంలో.. ఎన్నెన్ని అల్లర్లు జరిగాయో .. మొత్తానికి అన్నింటి పర్యవసానంగానే రాష్ట్రం సాధించుకున్నారు. 


అన్ని స్వానుభవాలు ఉన్న ఈ ఉద్యమనేత.. తాను అధికారంలోకి రాగానే.. రెగ్యులర్‌ పొలిటీషియన్‌లాగా.. ఉద్యమంలో దూకుడు ప్రదర్శించిన వారిపై కన్నెర్ర చేయడాన్ని గమనిస్తోంటే.. ఆయన వైఖరి కొంచెం నీరు- కొంచెం నిప్పు అన్నట్లుగానే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: