ఎమ్మెల్సీ ఓటమిపై టీడీపీ పోస్టుమార్టం

Padmaja Reddy
మ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులయిపోయాయి.... ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి గట్టిగా ఏడాది కూడా కాకుండానే... తమకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారనంటూ చంద్రబాబు నిత్యం గొప్పగా చెబుతున్న ఉభయగోదావరి జిల్లాల్లోనే ఆ పార్టీ బోర్లా పడింది.  కావాల్సినంత బలం, బలగం ఉండి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం దెబ్బతినడంపై చర్చ జోరందుకుంది. ఓటమికి గల కారణాలపై ప్రభుత్వం, ప్రజలు ఎవరికి వారు విశ్లేషణలు చెబుతున్నారు. ఈ ఓటమిపై టీడీపీ కారణాలు శోధిస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ ముఖ్య నేతలు చైతన్య రాజుకు సహకరించకపోవడమే ఓటమి కారణమని ప్రాథమికంగా తేల్చారు.


 ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం


ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు ఉదాహరణగా మాట్లాడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో యావత్తు బలగం సర్వసన్నద్ధంగా ఉన్నా, తూర్పులో మహామహులు కొలువైనా... ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటమిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో అభ్యర్ధి ఎంపికే పరాజయానికి పూర్తి కారణంగా నేతలు పేర్కొన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి చైతన్యరాజు బలమైన అభ్యర్ధిగా నిలిచినా, తిరుగుబాటు అభ్యర్ధిగా తెరపైకి వచ్చిన ప్రగతి కృష్ణారావును బుజ్జగించుకోవడంలో పార్టీ పెద్దలు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించారు. ప్రచారపు చివరి రోజుల్లో ప్రగతి కృష్ణారావుకు పార్టీతో సంబంధం లేదని ప్రకటించడం తప్పితే ముందస్తుగా ఇటువంటి చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. 


ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు


ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పలు చైతన్యరాజు విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ప్రగతి కృష్ణారావును రంగం నుండి తప్పించడంలో వైఫల్యం చెందిన నాయకులు.... పోటీ తీవ్రంగా ఉంటుందని వచ్చిన వార్తలపై కూడా పెద్దగా స్పందించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు, మూడు దఫాలు `టెలికాన్ఫరెన్‌‌స' ద్వారా వేడి పుట్టించడంతో... ప్రగతి కృష్ణారావుకు పార్టీతో సంబంధం లేదని ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొన్నారు.

ప్రచారంలో చైతన్యరాజు చెమటోడ్చినా


ప్రచారంలో చైతన్యరాజు చెమటోడ్చినా... రెండో ప్రాధాన్యత ఓటు కూడా పెద్దగా లభించకపోవడంపై జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక వైఖరి వెల్లడించేందుకు రెండో ప్రాధాన్యత ఓటును చైతన్యరాజుకు వెయ్యలేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ మేలుకోకపోతే ముందుముందు జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఫలితాలు ఇలాగే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: