మిస్టరీ ఫ్లైట్.. కాన్సెప్ట్ అదరహో..!

N.ANJI
కరోనా వల్ల ప్రపంచదేశాలు కుదేలయ్యాయి. ఈ మహమ్మరి తెచ్చిన సంక్షోభం వల్ల ఇప్పటి వరకు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అన్ని రవాణా సంస్థలు స్తంభించిపోయాయి. ఎయిర్‌లైన్స్ కూడా నిలిపివేశారు. లాక్‌డౌన్‌లో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు విమానాలు ఎయిర్‌పోర్టుకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలను ఎత్తివేసింది.
అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు తొలగడంతో ఆయా దేశాలు విమాన ప్రయాణానికి అనుమతించాయి. కానీ, కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో విమానయాన రంగం ఉన్న ప్రయాణికులతో కొనసాగిస్తూ.. నష్టాలను చవిచూస్తోంది. అయితే ఈ మేరకు ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు విమానయాన రంగం టికెట్ల ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ ఎయిర్‌లైన్ సంస్థ ఓ భిన్నమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. అదే మిస్టరీ ఫ్లైట్. ఈ కాన్సెప్ట్‌తో ప్రయాణికుల్లో విమానంపై ఆసక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా విమానాల్లో ప్రయాణించాలంటే మనం ఎక్కడికి వెళ్తమో ఆ ప్రాంతం వరకే టికెట్లు తీసుకుంటాం. కానీ, మిస్టరీ ఫ్లైట్ దేశీయ విమాన సర్వీసులో ప్రయాణికులు వారి గమ్యస్థానం ఎంటో చెప్పనక్కర్లేదు. సిబ్బంది కూడా ఆ విమానం ఎక్కడికి వెళ్తుందో చెప్పదు. టికెట్ కొనుగోలు చేసి విమానం ఎక్కితే సరిపోతుంది. ఆ విమానం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్లాలి. ఈ ప్రయాణం వ్యవధి కనీసం రెండు గంటలు ఉంటుంది. ఈ రెండు గంటల ప్రయాణం ముగిసిన తర్వాత ఏ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉంటే.. అక్కడే విమానాన్ని ల్యాండ్ చేస్తారు. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంగా ఏదైనా చూడదగ్గ ప్రదేశాలు ఉంటే విమానాన్ని భూమికి తక్కువ ఎత్తులో తీసుకెళ్తారంట. అలా ప్రయాణికులు విమానంలో నుంచి మంచి ప్రదేశాలను చూడవచ్చు. ఈ ప్రయాణానికి సంబంధించి బుకింగ్స్ కొనసాగుతున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 18, మే 1వ తేదీల్లో ప్రయాణాలు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర ఆస్ట్రేలియన్ డాలర్‌లో రూ.737, ఎకానమి క్లాస్ టికెట్ ధర ఆస్ట్రేలియన్ డాలర్‌లో రూ.577గా ఉంది. ఈ సేవలు ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని క్వాంటన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: