ఓ గొప్ప టీచ‌ర్‌: న‌రేంద్ర‌ను మించిన మాస్టారు ఉంటారా ?

VUYYURU SUBHASH
ప్ర‌తి మ‌నిషికి త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువు ఎంతో కీల‌కం. మ‌న‌కు అమ్మ‌, నాన్న జ‌న్మ‌ను ఇస్తే... గురువు జ్ఞాన బోధ చేసి మ‌న జీవితానికి ఓ సార్థ‌క‌త చేకూరుస్తాడు. అలాంటి గురువు ప‌ట్ల జీవితం చివ‌రి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌లు క‌న‌ప‌ర‌చాలి. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో అలాంటి సంబంధాలు గురువులు - శిష్యుల మ‌ధ్య ఉండడం లేదు. అయితే ఓ ఉపాధ్యాయుడు త‌మ పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పి మ‌రో ఊరుకు బ‌దిలీపై వెళుతుంటే అత‌డిపై ఓ గ్రామం అంతా చూపించిన ప్రేమ మామూలుగా లేదు. ఊళ్లో వాళ్లంతా భుజాల‌పై ఎక్కించుకుని మ‌రీ ఊరేగించి ఆ ఉపాధ్యాయుడిపై త‌మ ప్రేమ చాటుకున్నారు.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నరేంద్రకు వేరే ఊరికి బదిలి అయ్యింది. మ‌ల్లుగూడ గ్రామంలో ప‌దేళ్ల పాటు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ఉన్న న‌రేంద్ర బ‌దిలీపై మ‌రో గ్రామానికి వెళుతున్నారు. దీంతో ఆ గ్రామ‌స్తులు .. వారంతా కూడా గిరిజ‌నులే... వారు పెద్ద ఎత్తున గ్రామంలో వీడ్కోలు స‌భ ఏర్పాటు చేశారు. న‌రేంద్ర ప‌దేళ్ల పాటు ఇక్క‌డ ఉపాధ్యాయుడిగా ప‌నిచేసిన‌ప్పుడు విద్యార్థులు అంద‌రూ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాఠ‌శాల‌కు హాజ‌ర‌య్యేవారు.

వారికి విద్యాబుద్ధులు నేర్ప‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర చ‌దువుకున్న ఎంతో మంది ఈ రోజు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే న‌రేంద్ర అంటే ఆ గ్రామ‌స్తుల‌కు.... విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఎంతో గౌర‌వం. ఆయ‌న‌పై త‌మ‌కు ఉన్న అపార ప్రేమ చాటుకున్న గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఊరేగింపుగా తీసుకు వెళుతూ ఆనందోత్సవాల మధ్య వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏదేమైనా న‌రేంద్ర లాంటి ఉపాధ్యాయుల వ‌ల్ల స‌మాజంలో ఉపాధ్యాయ వృత్తికి గౌర‌వం మ‌రింత పెరుగుతుంది అన‌డంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: