కొత్త రాజకీయ పార్టీని పెడుతున్న ట్రంప్.. పార్టీ పేరేంటో తెలుసా?

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఓ మహిళ ఉపాధ్యక్షురాలయ్యారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కనీసం జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా రాలేదు. గడిచిన శతాబ్ద కాలంలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరైన ఏకైక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే.
పైగా మాజీ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌ను వీడటం ఇష్టం లేకపోవడంతో.. ట్రంప్ అధ్యక్షుడి హోదాలోనే వైట్ హౌస్‌ను వీడి ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లిపోయారు. అమెరికన్ల కోసం తాను ఎప్పటికి పోరాడుతూనే ఉంటానని ట్రంప్ వెళ్తూ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను పరిపాలన అందించానని అన్నారు. ఆయన మళ్లీ అధ్యక్ష బరిలో నిలుస్తారని చాలా మంది చెబుతూనే వచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశముంది. అయితే ఈ సారి ఆయన రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదు.
త్వరలో తాను సొంత రాజకీయ పార్టీని పెట్టాలనే యోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇప్పటికే ఈ పార్టీకి పేట్రియట్ పార్టీ అనే పేరును కూడా అనుకున్నారు. ఇప్పటికిప్పుడు ఈ పార్టీని పెట్టకపోయినా.. సరైన సమయం చూసి పార్టీని ప్రారంభించాలని ట్రంప్ అనుకుంటున్నారట. కేపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌పై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఆ వ్యతిరేకత పోయేంత వరకు తాను స్తబ్దంగానే ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ గొడవ సద్దుమనిగిన తరువాత మళ్లీ తాను తెరపైకి రావాలని ట్రంప్ యోచిస్తున్నారు. దేశానికి తాను ఎంతో చేశానని, తిరిగి వైట్ హౌస్‌కు వస్తానంటూ ట్రంప్ చివరి సారిగా వీడియో సందేశాన్ని ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: