రామతీర్థం ఆలయ ఘటనకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ లో రామతీర్థం ఆలయంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కొనసాగుతుంది. ఈ అంశంపై రాజకీయ దుమారం ఇంకా రేగుతూనే ఉంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ నేతలు, జనసేన అధినేత ఆరోపణలు, సవాళ్ల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో రామతీర్థంలో శ్రీ కోదండరామస్వామి విగ్రహాల పునఃప్రతిష్ఠకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం నుంచి విగ్రప పునఃప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలను దేవాదాయశాఖ ప్రారంభించనుంది. విగ్రహ పునఃప్రతిష్ఠతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విగ్రహాల పునః ప్రతిష్ఠకు ముందు చేపట్టాల్సిన                                                                                       పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు.
రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠతో పాటు ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హోమం పూర్తైన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయ ఆధునీకరణలో భాగంగా గర్భాలయాన్ని కదిలించకూడదని అధికారులు భావిస్తున్నారు. పురానతన కాలంలో నిర్మించినా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ లోపలి భాగాని మాత్రమే పూర్తిగా ఆధునికీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారాలను పూర్తిస్థాయిలో పునర్నిర్మించనున్నారు. కొండపై జరిగే అభివృద్ధి పనులకు సరిపడా నీరు అందుబాటులో ఉంచేందుకు దేవాదాయశాఖ యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తోంది. ఆలయంతో పాటు రామతీర్థం కొండ మెట్లమార్గాన్ని కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని విస్తరించనున్నారు. కొండపైనున్న ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరును కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నారు.
                                                                మరోవైపు రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రుడి మూలవిరాట్ తో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు రూపొందిస్తున్నారు. ఈనెల 23 నాటికి విగ్రహాలను శిల్పులు దేవాదాయశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రామతీర్థం ఆలయ ఆధునికీకరణ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: