నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!

SRISHIVA
ఇండోనేషియా విమాన ప్రమాదం  విషాదాంతమైందని భావిస్తున్నారు. విమాన ఆచూకీ కోసం శనివారం మొదలుపెట్టిన గాలింపులో ఆదివారం ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. ఆదివారం  ఉదయం జావా సముద్రంలో కొంతమంది శరీర భాగాలు, దుస్తులు సహా కొన్ని విమాన శకలాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.దీంతో ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది.
               విమాన శకలాలుగా అనుమానిస్తున్న లోహపు భాగాలను, కొన్ని తీగలను ఉత్తర జకార్తాలోని థౌజండ్‌ ఐలాండ్స్‌ లో గుర్తించినట్లు మత్స్యకారులు తెలిపారు. తమకు 30 మీటర్ల దూరంలో పిడుగుపాటు, బాంబుపేలుడు వంటిదేదో సంభవించినట్లు అనిపించిందని చెప్పారు.
 
          విమానం కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ దేశ రావాణాశాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. ఇప్పటి వరకు లభించిన శకలాలు లాంకాంగ్‌, లకీ ద్వీపాల మధ్య కనుగొన్నట్లు వెల్లడించారు. చివరిసారి అందిన సంకేతాల ఆధారంగా విమానం అదశ్యమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు అటు నావికాదళం సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానం అదశ్యమై దాదాపు 16 గంటలు గడుస్తున్నా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
     ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్‌ ప్రావిన్సు రాజధాని పొంటియానక్‌కు బయలుదేరింది. జకార్తా– పొంటియానక్‌ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్‌ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్‌ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: